ఆయన అందమైన మెలోడీలతో మెప్పించగలడు.. ఊరమాస్ గీతాలతో హుషారు తెప్పించగలడు… జీవితానికి సరిపడే వేదాంతాన్ని తన గీతాలతో వల్లించగలడు… జానపద సాంప్రదాయాన్ని, పాశ్చాత్య శైలిని మిళితం చేసి చిందులేయించగలడు. ఆఖరికి ఐటెమ్ గీతాలతో కూడా కుర్రకారు కు మంత్రం వేయగలడు. ఆ గీత రచయిత పేరు భాస్కరభట్ల రవికుమార్. రాజమండ్రి లో పుట్టి.. ఆ తీరంలోనే గోదావరి నీళ్ళను గలగలపారించిన పాటల పోకిరి ఆయన.
‘గొప్పింటి అల్లుడు’ చిత్రంతో ప్రయాణం మొదలుపెట్టిన భాస్కరభట్ల , పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’తో విజయాన్ని అందుకొన్నారు. అక్కడ్నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత పూరి జగన్నాథ్‌తోనే వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు. సంగీత దర్శకుడు చక్రి, భాస్కరభట్ల ప్రయాణం ఒకేసారి మొదలైంది. చక్రి స్వరాలు సమకూర్చిన చిత్రాల్లో, దాదాపు 65 చిత్రాలకి భాస్కరభట్ల గీతాలు రాశారు. 1974 జూన్ 5న శ్రీకాకుళంలో జన్మించిన ఆయన రాజమండ్రిలో పెరిగారు. తాత అరవెల్లి రాజగోపాలాచార్య నుంచి సాహిత్యాభిలాషని పుణికి పుచ్చుకున్న భాస్కరభట్ల చిన్నప్పుడే కవితా పఠనంపై దృష్టిపెట్టారు. బి.ఎ లిటరేచర్ పూర్తి చేసిన అనంతరం పాత్రికేయుడిగా ప్రయాణం మొదలుపెట్టారు. రాజమండ్రి, హైదరాబాద్‌ల్లో పనిచేసిన ఆయన ఆ తర్వాత పాత్రికేయ ఉద్యోగాన్ని వదిలిపెట్టి గీత రచననే కెరీర్‌గా మలుచుకున్నారు. నేడు భాస్కర భట్ల పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
హ్యాపీ బర్త్ డే భాస్కరభట్ల