చిత్రం : ‘స్టాలిన్’.. అందరివాడు
నటీనటులు : జీవా, రియా సుమన్, వరుణ్ ,నవదీప్, సతీష్, గాయత్రీ కృష్ణ, ఆర్.ఎన్.ఆర్ .మనోహర్ తదితరులు
సంగీతం : డి.ఇమాన్
సినిమాటోగ్రఫీ : ప్రసన్నకుమార్
బ్యానర్ : వేల్స్ ఫిల్మ్ ఇంటర్ నేషనల్
నిర్మాత : నట్టికుమార్
దర్శకత్వం : రత్నశివ
విడుదల తేదీ : ఫిబ్రవరి 7, 2020
చిరంజీవి పాత సినిమా టైటిల్స్ ను డబ్బింగ్ సినిమాలకు పెట్టడం లేటెస్ట్ ట్రెండ్ . ఆ జాబితాలో మరో సినిమా ‘స్టాలిన్’ . అంతేకాదండోయ్.. దీని ట్యాగ్ లైన్ ‘అందరివాడు’ కూడా చిరు టైటిలే అవడం విశేషం. ‘రంగం’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన జీవా ఇందులో హీరో. తమిళంలో ‘సీరు’ గా విడుదలై.. పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకున్న ఈ సినిమా తమిళంలో పాటు తెలుగులోనూ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇంతకీ ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో మెప్పిస్తుంది? జనాన్ని ఆకట్టుకొనే అంశాలు అందులో ఏమేం ఉన్నాయి? చూద్దాం.
కథ:
అన్నవరంలో ‘కొక్కొరొక్కో’ అనే లోకల్ టీవీని రన్ చేస్తూ దాని ద్వారా .. ఆ చుట్టుపక్కలున్న సమస్యల్ని ఎత్తిచూపించి.. వాటికి పరిష్కారాన్ని చూపిస్తుంటాడు స్టాలిన్ (జీవా). తన టీవీ ఛానల్ ద్వారా ఆ ఏరియా ఎమ్మెల్యేకి కంటిమీద కునుకులేకుండా చేస్తాడు హీరో. దాంతో స్టాలిన్ ను చంపడానికి వైజాగ్ నుంచి మల్లి (వరుణ్) అనే ఒక కిల్లర్ కి సుపారి ఇస్తారు. స్టాలిన్ ను వెతుకుతూ మల్లి అన్నవరం వస్తాడు. స్టాలిన్ గర్భవతైన తన చెల్లెల్ని కంటికిరెప్పలా చూసుకుంటూ ఉంటాడు. మల్లి స్టాలిన్ ను వెతుకుతూ అతడింటికి వస్తాడు. ఆ టైమ్ లో స్టాలిన్ ఇంట్లో ఉండడు. ఆమెకు నొప్పులు ప్రారంభమవుతాయి. మల్లి ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేసి వెళ్ళిపోతాడు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. దాంతో తన చెల్లెలి ప్రాణాల్ని కాపాడిన మల్లికి కృతజ్నతలు చెప్పడానికి అతడ్ని వెతుక్కుంటూ వెళతాడు. స్టాలిన్ మల్లి దగ్గరకు వెళ్ళే సమయానికి ఎవరో అతడిమీద హత్యా ప్రయత్నం చేస్తారు. మల్లిని హాస్పిటల్ లో జాయిన్ చేసిన స్టాలిన్ కు అతడి హత్యవెనుక చాలా పెద్ద హ్యాండే ఉందని తెలుస్తుంది. ఇంతకీ మల్లిని చంపాలనుకుంటున్నది ఎవరు? అతడ్ని ఎందుకు చంపాలనుకుంటారు? అన్నదే మిగతా కథ.
కథనం విశ్లేషణ:
కొన్ని డబ్బింగ్ సినిమాల్ని లైట్ తీసుకోడానికి వీల్లేదు. ఏ పుట్టలో ఏ పాముంటుందో చెప్పలేం కదా. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా.. థియేటర్ కి వెళితే.. మనం ఊహించిన దానికన్నా భిన్నంగా ఆ సినిమా మనల్ని అలరించవచ్చు. అలాంటి సినిమానే ‘స్టాలిన్’. సినిమా బిగినింగ్ లో ఇది అన్ని సినిమాల మాదిరిగానే పరమ రొటీన్ సినిమా అనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే సీన్స్ కూడా చాలా సాధారణంగా అనిపిస్తాయి. కొంత సేపటికి సినిమా లో అసలు రంగం మొదలవుతుంది. కథ రసపట్టులో పడుతుంది. కథానాయకుడు స్టాలిన్ ను మల్లి చంపడానికి వచ్చే సీన్ దగ్గర కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. మల్లి స్టాలిన్ చెల్లెల్ని హాస్పిటల్ లో జాయిన్ చేసి వెళ్లిన తర్వాత వచ్చే సీన్స్ అన్నీ ఆకట్టుకుంటాయి . అదిరిపోయే ఒక ఫైట్ సీక్వెన్స్ తో మల్లిని హత్యాప్రయత్నం నుంచి స్టాలిన్ కాపాడే సీన్ దగ్గర ఇంటెర్వెల్ బ్యాంగ్ ఇచ్చి .. సెకండాఫ్ మరింత ఆసక్తిగా ఉంటుందని హింటిస్తాడు దర్శకుడు.
సెకండాఫ్ బిగినింగ్ నుంచీ స్ర్కీన్ ప్లే ను మరింత గ్గిప్పింగ్ గా నడిపించి.. రేసీ సీన్స్ తో సినిమాను పరుగుపెట్టిస్తాడు దర్శకుడు . మంచి సామాజిక అంశాన్ని లేవనెత్తి.. ఆడపిల్లలు ఆదిపరాశక్తులని, తమకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు తెగిస్తే.. ఎంతటి పలుకుబడి ఉన్నవాడైనా సరే కలుగులో ఉన్న ఎలకలా బైటికి రావల్సిందే అని ఈ సినిమాతో చెప్పాడు దర్శకుడు.
నటీనటుల పెర్ఫార్మెన్స్ :
స్టాలిన్ గా జీవా తనదైన శైలిలో నటించి మెప్పించాడు. ఇక కథానాయిక రియా సుమన్ ది అంతగా పెర్ఫామెన్స్ కు స్కోపున్న పాత్రకాదు. రొటీన్ మాస్ సినిమాల్లో నటించే సాధారణ కథానాయికే అనిపిస్తుంది. మల్లిగా నటించిన వరుణ్ బాగా పెర్పామ్ చేశాడు. ప్రొఫెనల్ కిల్లర్ గా పాజిటివ్ యాంగిల్ ఉన్న పాత్రలో ఇమిడిపోయాడు. ఇక ఇందులో చెప్పుకోదగ్గ మరో పాత్ర విలన్ గా నటించిన నవదీప్ దే. క్రిమినల్ లాయర్ గా ఇటు క్రూయాలిటీని, అటు వైవిధ్యాన్ని ప్రదర్శించి తనలో మంచి నటుడున్నాడని చాటుకున్నాడు. అలాగే ఇందులో హీరో చెల్లెలిగా నటించిన అమ్మాయి బాగా నటించింది . ఇక క్రిమినల్ లాయర్ అయి.. అత్యాచారానికి గురై.. రాజకీయాలకు బలైపేయిన చాలా మంది అమ్మాయిలకు న్యాయం చేయాలని కలలు కని అది తీరకుండానే హత్య గావించబడిన అమ్మాయిగా గాయత్రీ కృష్ణ కూడా చాలా బాగా నటించింది. సో మొత్తానికి స్టాలిన్ మాస్ కథాంశం అయినప్పటికీ .. చక్కటి సందేశం తో కూడుకున్న చిత్రంకూడా .
సాంకేతిక వర్గం :
డి.ఇమాన్ సంగీత సారధ్యంలోని పాటలు పర్వాలేదనిపిస్తాయి. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను మాత్రం సన్నివేశాల మూడ్ కు తగ్గట్టుగా బాగానే అందించాడు. ఇక సినిమాటో గ్రఫీ విషయానికొస్తే .. ప్రతీ సన్నివేశంలోనూ తనదైన పనితనం చూపించాడు ప్రసన్నకుమార్. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్ లో తన ప్రతిభను చాటుకున్నాడు .
సో.. మొత్తం మీద ‘స్టాలిన్’ చిత్రం తమిళ ప్రేక్షకుల్నే కాకుండా.. తెలుగు ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు.
రేటింగ్ : 2.75
బోటమ్ లైన్ : ఆసక్తిని రేపే ‘స్టాలిన్’
review by : రామకృష్ణ క్రొవ్విడి