ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు. ఈయనకు సోగ్గాడు అనే సెపరేట్ ఇమేజ్ వుంది. శోభన్ బాబు రింగ్ అంటూ హెయిర్‌స్టైల్ బాగా ఫేమస్ అయ్యింది. సెంటిమెంట్ మూవీలకు కమర్షియల్‌గా అస్సెట్ అయిన ఇమేజ్ శోభన్ బాబుది. ఇద్దరి భార్యల ముద్దుల మొగుడు పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పేరుండేది. తెలుగు ప్రేక్షకుల్లో అత్యధిక లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న హీరో శోభన్ బాబే. హలో గురు చిత్రం వరకు ఆయన హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఈ మూవీ తర్వాత ఉన్నట్టుండి సినిమాలకు దూరమయ్యారు.
హలోగురూ తర్వాత ఆయన హైదరాబాద్ కూడా రాలేదు. కొన్ని సినిమా అవకాశాలు, అద్భుతమైన క్యారెక్టర్స్ అయన్ను వెతుక్కుంటూ చెన్నై వెళ్లాయి. కానీ ఆయన వాటిని రిజెక్ట్ చేసారు. వివరాల్లోకెళ్తే.. శోభన్ బాబు ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. హీరోగా ఎంతో మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు. హీరోగా పరిచయమై, హీరోగా రాణించి, హీరోగానే ఇండస్ట్రీని వదిలి, అభిమానుల మనసుల్లో హీరోగానే స్థిరపడిపోవాలని నిశ్చయించుకున్నారట శోభన్‌బాబు. వయసు మళ్లింది కదా అని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారే ఆలోచన లేదని ఆయన చాలా సార్లు సన్నిహితులు, మీడియా మిత్రులతో చెప్పినమాటే. అనుకున్నట్టుగానే సరైన టైమ్‌లో నటనకు ఫుల్‌స్టాప్ పెట్టేశారు. ఆయన రిటైర్‌మెంట్ తీసుకున్నా సినిమా అవకాశాలు మాత్రం క్యూ కట్టాయి. వాటిని ఆయన సున్నితంగా తిరస్కరించారు. అలా శోభన్ బాబు రిజెక్ట్ చేసిన సినిమాల్లో అన్నమయ్య కూడా ఒకటి. అది కూడా సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరుని పాత్ర. అన్నమయ్య ప్రొడ్యూసర్ వి. దొరస్వామి రాజు, డైరెక్టర్ కె. రాఘవేంద్రరావులు వేంకటేశ్వర స్వామి పాత్రకు శోభన్ బాబు అయితే సరైన న్యాయం జరుగుతుందని అనుకున్నారట. అలా ఆయన్ను సంప్రదించి అన్నమయ్య మూవీ రోల్ ఆఫర్ చేస్తే.. సినిమాలు చేయకూడదని తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వున్నట్టుగా చెప్పారట. ఆ క్యారెక్టర్‌ను సుమన్‌తో చేయించి మంచి రిజల్ట్ పొందారు అన్నమయ్య దర్శక నిర్మాతలు. అలా అన్నమయ్య సినిమాలో సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరుని పాత్రను కూడా చేయనని చెప్పారట. అదీ శోభన్ బాబు గారు తన తీసుకున్న నిర్ణయానికి నిలబడి వుండే ఖచ్చితత్త్వం , నిఖార్సయిన వ్యక్తిత్వం.