అక్కినేని నాగార్జున కెరీర్ లో ప్రత్యేకమైన చిత్రం ‘వారసుడు’ . జయభేరీ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో డి.కిశోర్, మురళీ మోహన్ నిర్మించిన ఈ సినిమా మే 5, 1993న విడుదలై ఘన విజయం సాధించింది. సూపర్ స్టార్ కృష్ణ ప్రత్యేక పాత్ర పోషించిన ఈ సినిమాలో కథానాయికగా నగ్మా నటించింది. కీరవాణి సంగీత సారధ్యంలోని పాటలు ఇప్పటికీ మారు మోగుతునే ఉన్నాయి. తన తల్లి చావుకు మాఫియా డాన్ అయిన తండ్రి కారణమయ్యాడన్న కారణంతో అతడిని చిన్నతనం నుంచి ద్వేషించడం మొదలు పెడతాడు హీరో. అయితే తన కొడుకు ప్రేమాభిమానాల్ని దక్కించుకోవడానికి సొంత మనవడ్నే కిడ్నాప్ చేయించి .. తన కొడుకు కు దగ్గరవ్వాలనుకుంటాడు తండ్రి. ఈ క్రమంలో చోటు చేసుకున్న సంఘటనల సమాహారమే ‘వారసుడు’ చిత్ర కథ. నిజానికి ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన ‘పూల్ ఔర్ కాంటే’ (అజయ్ దేవ్ గణ్ డెబ్యూ మూవీ) చిత్రానికి రీమేక్ . అయితే ఆ సినిమా మలయాళ చిత్రం ‘పరంపర’ (మమ్ముట్టి ద్విపాత్రాభినయం) ను బేస్ చేసుకొని రూపొందింది. మలయాళ , హిందీ భాషల్లో సూపర్ హిట్టయిన ఆ కథ తెలుగులో కూడా అదే స్థాయిలో విజయం సాధించడం విశేషం. మాఫియా డాన్ గా నటించిన సూపర్ స్టార్ కృష్ణ నటన వారసుడు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. ఇవివి తనదైన స్థాయిలో కామెడీ టచ్ ఇచ్చిన ఈ సినిమా నాగార్జున కెరీర్ కు మంచి బూస్టప్ ను ఇచ్చింది.