‘ప్రేమ’ రెండక్షరాల పదం. ఆ ప్రేమలో పడిన వారికే దాని మహిమ తెలిసేది. ప్రేమ చిగురించడానికి క్షణకాలం చాలు…  కానీ అదే ప్రేమ దూరమైతే కలిగే ఎడబాటుకు జీవితకాలమైన కూడా సరిపోదు. ఎందుకంటే ఇద్దరి మనసుల మధ్య కలిగే ప్రణయ ఘోషకు పేరు ప్రేమ. వేటూరి వర్ణించినట్లు లిపి లేని కంటి భాష ప్రేమ. గొప్ప ప్రేమ ఎప్పుడు రచయితలు కవులు రాసే పుస్తకాల్లోను, చారిత్రక కట్టడాల్లోనే అపురూపంగా అజరామరంగా ఉంటుందనే వాదన కూడా ఉంది. ఎందుకంటే ప్రేమ ఎంత మధురమో దాన్ని జయించి గెలుపొందేందుకు ఆ ప్రేమికులు పడే కష్ట నష్టాలు అన్నీఇన్ని కావవి. అన్నిటినీ జయించిన ప్రేమకథలు సుఖాంతం అయ్యేవి  కొన్ని… విషాదాంతో ముగిసే ప్రేమ కథలు మరికొన్ని… అలా మన తెలుగు సినిమాలలో ప్రేమకథలతో తెరకెక్కిన టాప్ 20 ప్రేమకథలేంటో ఇప్పుడు చూద్దాం.

1. దేవదాస్ :

తెలుగువారందరకి అన్నిటికన్నా ముందుగా గుర్తొచ్చే ఎవర్గ్రీన్ ప్రేమ కావ్యం ‘దేవదాస్’. ఇందులో దేవదాస్ గా అక్కినేని నాగేశ్వరరావు, పార్వతిగా సావిత్రి ఆయా పాత్రలో జీవించేశారు. అంతే కాకుండా ఆ పాత్రలు వారి నటప్రస్థానంలో కలికితురాయిగా నిలిచిపోయాయి. దేవదాస్ పార్వతి ప్రేమలను పెద్దలు అంగీకారం తెలుపకపోవడంతో ఆ కథ విషాదాంతో ముగిసినప్పటికి ఎన్నో ప్రేమ కథలకు స్పూర్తి వారి ప్రేమ కథ. ఈ సినిమాని కృష్ణ  మళ్ళీ తెరకెక్కించిన కూడా ఇంతటి గొప్ప చిత్రంగా నిలువలేదు. అలాగే హిందీలో షారూఖ్ ఖాన్, ఐశ్వరయ్యరాయ్, మాధురి దీక్షిత్ లతో భారీగా తెరకెక్కించారు. వాటన్నిటిలో కూడా ఏఎన్ఆర్ ‘దేవాదాస్’ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్గ్రీన్ గా నిలిచింది.

2. మూగ మనసులు :

పునర్జన్మ ప్రేమకథా  నేపథ్యంతో వచ్చిన మొట్ట మొదటి తెలుగు సినిమా ‘మూగ మనసులు’. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున ప్రధాన తారాగణంగా వచ్చిన ఈ సినిమాలోనూ అంతస్తుల తేడా కారణం చేత అంటే.. జమీందారి గారి అమ్మాయి గా సావిత్రి ఆ ఇంట్లో పాలేరు పాత్రలో అక్కినేని నటించగా వారి ప్రేమ అంతస్తుల విషయంలో సమాధి అవ్వడం. సావిత్రిని కాలేజీ కుర్రాడైన పద్మనాభంకు ఇచ్చి వివాహం చేయటం తర్వాత తను మరణించడం… దానితో ఆమే పుట్టింటికి తిరిగిరావడం… ఊర్లో  గోపీకి తనకి మధ్య సంబందం ఉన్నట్లు పుకార్లు తలెత్తడంతో ఓ రోజు వెళ్లిపోవాలని బల్లకట్టుపై వెళ్తుండగా గోదావరి ఉప్పొంగిన వరద లో వారు మరణించడడం. మరు జన్మలో మళ్ళీ జన్మించి అదే ప్రాంతానికి  వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ పూర్వ జన్మ తాలూకు జ్ఞాపకాలు గుర్తుకురావడం… అసలేమి జరిగింది అనేది అప్పటికే వృద్దురాలైన గౌరి వారికి వివరిస్తుంది. అలా ఒక జన్మలో వేరైనా ప్రేమికులు ఇంకో జన్మలో జయించి వారి ప్రేమను జయించారు. ఈ పునర్జన్మ కథాంశంతో చాలా తెలుగు సినిమాలు తెరకెక్కాయి వాటిలో అల్లరి నరేష్, సదా నటించిన ‘ప్రాణం’, రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ నటించిన ‘మగధీర’ చిత్రాలు ఈ కోవలోకే వస్తాయి.

3. మరో చరిత్ర :

బ్లాక్ & వైట్ చిత్రంగా తెరకెక్కి సంచలన విజయం సాధించిన కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘మరో చరిత్ర’. ఇది తెలుగులో డబ్బింగ్ చిత్రంగా వచ్చి అనూహ్యమైన విజయాన్ని సాధించింది. కథ విషయానికి వస్తే ఒక బ్రాహ్మణ యువకుడు (కమల్ హాసన్) క్రిష్టియన్ అమ్మాయి (సరిత) ప్రేమించుకుంటారు. ఇక్కడ పెద్దలకు వారి ప్రేమను అంగీకరించపోవడానికి అంతస్తులు కారణం కాదు. వారి కులాలు, మతాలు, సాంప్రదాయాలు వేరు వేరు కావడమే. ఈ సినిమా చివరికి విషాదాంతో ముగిసినప్పటికి కూడా ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిన చిత్రం ‘మరో చరిత్ర’.

4. సీతాకోకచిలుక :

భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన టీనేజ్ ప్రేమకథా చిత్రం  ‘సీతాకొకచిలుక’. ఈ సినిమాలో కార్తీక్, ముచ్చర్ల అరుణ, శరత్ బాబు, సిల్క్ స్మిత తారాగణంతో వచ్చిన ఈ సినిమా కాన్సెప్ట్  ను ఇప్పటికీ వాడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు. కథ పరంగా చూస్తే తాను ప్రేమించిన అమ్మాయికి బావ సినిమాలో విలన్ గా ఉంటూ వారి ప్రేమకు అడ్డు పడుతుంటాడు. గొంగళి పురుగు నుండి సీతాకోకచిలుకగా మారే దశలా అప్పుడే  యవ్వనంలోకి ప్రవేశించిన ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ కథే ఈ ‘సీతాకోకచిలుక’.

5. గీతాంజలి :

దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘గీతంజాలి’ మరో అద్భుతమైన ప్రేమ కావ్యం గా చెప్పవకచ్చు. అప్పటి వరకు ఎక్కడ టచ్ చేయని లైన్ తో ఈ సినిమాలోని హీరో హీరోయిన్లు  ఇద్దరు కేన్సర్ భారీన పడటం వారి  మధ్య జరిగే ప్రేమ సన్నివేశాలతో సినిమా కథా సాగుతుంది. సినిమాలో అక్కినేని నాగార్జున, గిరిజ షెట్టర్ హీరోహీరోయిన్లుగా నటించారు. భూమి మీద పుట్టిన ప్రతిప్రాణికి మరణం ఉంటుంది కానీ ప్రేమకు మాత్రం మరణం ఉండదు అనే సందేశాన్ని ఇస్తుంది ఈ ‘గీతాంజలి’. ఈ సినిమా ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డ్ తో పాటు 7 నంది అవార్డ్స్ ను దక్కించుకుంది.

6. ప్రేమాభిషేకం  :

 దాసరి నారాయణరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి, మోహన్ బాబు, జయసుధ, మురళి మోహన్ తారాగణంతో వచ్చిన ‘ప్రేమాభిషేకం’ సినిమా ప్రేమకథలలో నూతన ఒరవడిని సృష్టించింది. తనకు కేన్సర్ ఉందని తెలుసుకున్న కథానాయకుడు ప్రియురాలికి తన పై ద్వేషం కలిగి ఇంకోకరిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలనే వినూత్నమైన కథనంతో నడిచే కథ… దాసరి శైలి డైలాగ్స్… ఏఎన్ఆర్ అభినయం… శ్రీదేవి గ్లామర్, జయసుధ అతిథి పాత్ర కలిపి సినిమా అఖండ విజయం సాధించింది.

7. ముద్ద మందారం :

జంధ్యాల దర్శకత్వంలో ప్రదీప్, పూర్ణిమ లతో రూపొందిన మరో టీనేజ్ ప్రేమకథా చిత్రం ‘ముద్ద మందారం’. ప్రదీప్ సంపన్న కుటుంబానికి చెందిన యువకుడు. పూర్ణిమ పేదింటికి చిందిన యువతి. వీరి మధ్య చిగురించిన ప్రేమ ను పెద్దలు తిరస్కరించడంతో పారిపోయి పెళ్లి చేసుకుని మళ్ళీ చివరికి పెద్దల అనుమతితో ఒకటై సుఖాంతంగా ముగిసే చిత్రమే ‘ముద్ద మందారం’.

8. అభినందన :

‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’ అంటూ యావత్తు తెలుగునాట ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన చిత్రం ‘అభినందన’. కార్తీక్, శోభన, శరత్ బాబు, సోమయాజులు తారాగణంతో అశోక్ కుమార్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. తను ప్రేమించిన అబ్బాయిని కాదని పరిస్తుతుల దృశ్య తన బావను పెళ్లిచేసుకుని ప్రేమించిన వ్యక్తి ఆమెనే తలుచుకుంటూ జీవితం గడుపుతుంటే… వంటి సంఘర్షణ సన్నివేశాలతో ఈ విషయం తెలుసుకున్న బావ వారి ప్రేమను కలిపేందుకు ప్రాణత్యాగం చేసుకుని వారి ప్రేమకథకు సుఖాంతం చేకూరుస్తాడు.

9. ప్రేమించి చూడు  :

అక్కినేని నాగేశ్వరరావు, రాజ శ్రీ, కాంచన, రేలంగి ప్రధాన పాత్రలతో పి. పుల్లయ్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ప్రేమించి చూడు’. ఇది హాస్య సన్నివేశాలతో సినిమా ఆధ్యాంతం కొనసాగి సుఖాంతంగా ముగుస్తుంది ఈ ‘ప్రేమించి చూడు’ చిత్రం.

10. తొలి ప్రేమ :

దర్శకుడు కరుణాకరణ్, పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కించిన చిత్రం ‘తొలి ప్రేమ’. ఈ సినిమా ఆంధ్రనాట ఓ ప్రభంజనం సృష్టించింది. బాలు అనే కుర్రాడు ఓ రాత్రి రోడ్డు పై ఓ అమ్మాయిని దీపావళి టపాసుల కాంతులలో చూసి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి ఆచూకీ కోసం వెతకడం… అనుకోకుండా జరిగిన ప్రమాదం లో ఆ అమ్మాయినే తనకు పరిచయం అవ్వడం వంటి సన్నివేశాలతో సాగే చిత్రం చివరికి వచ్చే సరికి జీవితంలో అమ్మాయి సాధించాలన్న గమ్యానికి పవిత్రమైన తమ ప్రేమ అడ్డు కాకూడదు అనే సందేశాన్ని ఇస్తూ కథ సుఖాంతం అవుతుంది.

11. ఆర్య :

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, శివ బాలాజీ, అను మెహతా తారాగణంతో రూపొందిన ట్రై యాంగిల్ ప్రేమకథా చిత్రం ‘ఆర్య’. ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ఓ పెయింటింగ్ లా సుకుమార్ మలచిన విధానం అద్భుతం. కథ విషయానికి వస్తే ఇది కాలేజ్ యువతి యువకుల మధ్య నడిచే ప్రేమ కథ. అజయ్ (శివ బాలాజీ)అనే కుర్రాడు... గీత (అను మెహత) అనే అమ్మాయి ప్రేమించకపోతే కాలేజీపైకి ఎక్కి దూకేస్తా అని బెదిరించి, ఆమె ప్రేమను సాధిస్తాడు. అదే సమయంలో ఆమె జీవితంలోకి ఆర్య (అల్లు అర్జున్) అనే వ్యక్తి వస్తాడు. ఆ అమ్మాయిని ఆర్య కూడా ప్రేమిస్తాడు. అలా గీత చివరకు ఆర్య ప్రేమను పొందడానికి ఉన్న చిన్న ఫ్లాష్ బ్యాక్ సీన్ తో ‘ఆర్య’ ప్రేమకు హ్యాపీ ఎండింగ్ తో ముగుస్తుంది.

12. వర్షం :

ప్రభాస్, త్రిష, గోపీచంద్ తారాగంతో నిర్మాత ఎం.ఎస్. రాజు నిర్మాణంలో శోభన్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథా చిత్రం ‘వర్షం’. ఈ సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించి త్రిషను సొంతం చేసుకునేందుకు ప్రభాస్ త్రిషల మధ్య ప్రేమ వికటించేందుకు చేసిన ప్రయత్నాలు చివరికి ప్రభాస్ త్రిషల ప్రేమ ఎలా సుఖాంతం అయ్యిందనేదే ‘వర్షం’ సినిమా.

13. నువ్వే కావాలి :

తరుణ్, రిచా, సాయి కిరణ్ తారాగణంతో కె. విజయభాస్కర్ దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల రచయిత గా చేసిన సినిమా ‘నువ్వే కావాలి’. సినిమా కథ విషయానికి వస్తే ఎదురెదురు ఇంట్లో ఉండే బాల్య స్నేహితులు ప్రేమికులుగా మారడానికి ఏర్పడిన సన్నివేశాలు ఏమిటి..? సాయి కిరణ్ తో నిశ్చితార్ధం అయిన రిచాను చివరకు తరుణ్ ఇద్దరు ఎలా ఒకటయ్యారు అనేది కథ.

14. నువ్వు నేను :

దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్, అనితలతో అంతస్తులు సమాజంలో స్టేటస్ వంటి కథనాలతో రూపొందించిన చిత్రం ‘నువ్వు నేను’. ఇరు కుటుంబాలు కాదన్న తమ ప్రేమను పొంది ఇద్దరు ఎలా ఒకటయ్యారు. ఈ క్రమంలో వారు ఎదురుకున్న సమస్యలు ఇబ్బందులు వంటి పరిస్థితులతో సినిమా సాగుతుంది. చివరికి కాలేజ్ విద్యార్ధుల సపోర్ట్ తో వారి ప్రేమ సుఖాంతం అవుతుంది.

15. ఖుషి :

పవన్ కళ్యాణ్, భూమిక హీరో హీరోయిన్లుగా ఎస్.జె. సూర్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఖుషి’. సినిమా ప్రారంభంలోనే ఒకరికోసం ఒకరు పుట్టిన చిన్నారులుగా  హీరో హీరోయిన్లను చూపించడం తర్వాత వాళ్ళు కాలేజ్ సమయానికి కలుసుకోవడం. స్నేహితులుగా పరిచయం ఏర్పడిన తర్వాత  అపార్ధాలతో మనస్ఫర్థలు ఏర్పడతాయి. తర్వాత ఆ అపార్థాలు తొలగిపోయి... ఒకరి గురించి ఒకరు తెలుసుకుని... వారి ప్రేమ ఎలా సుఖాంతం అయ్యిందనేది కథ. ఎప్పుడు గొడవ పడే ప్రేమికులుగా పవన్ భూమిక జంట ఆకట్టుకుంది.

16. ఏ మాయ చేశావె  :

వైవిధ్యమైన ప్రేమకథలను తెరకెక్కించే దర్శకుడు గౌతం మీనం నాగచైతన్య, సమంత  హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘ఏ మాయ చేశావె’. రెహమాన్ స్వర పరిచిన పాటలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచి సినిమా విజయానికి సహకరించాయి. తనకన్నా వయసులో పెద్దదైన కథానాయిక జెర్సీ ప్రేమ ను కార్తీక ఎలా పొందాడనేది కథ.

17. కొత్త బంగారు లోకం :

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్  హీరో హీరోయిన్లుగా వచ్చిన మరో టీనేజ్ లవ్ స్టోరీ. ప్రేమ విలువతో పాటు జీవితంలో ఉండే తల్లిదండ్రుల బాద్యత ప్రేమలను గురించి చక్కగా వివరించిన ఉత్తమ చిత్రం ‘కొత్త బంగారు లోకం’. ప్రేమించుకున్న బాలు, స్వప్న లు కొన్ని కారణాల వల్ల చోటు చేసుకున్న పరిస్థితులు చివరికి తను ప్రేమించిన ప్రేమను బాద్యతను తెలుసుకున్న బాలు ఎలా పొందాడు అనేదే కథ.

18. నిన్నే పెళ్లాడతా :

ఇరు కుటుంబాల మధ్య ఉన్న గొడవల  నడుమ ప్రేమించుకున్న శీను (నాగార్జున), మహాలక్ష్మి (టబు) ఎలా వారి ప్రేమను సొంతం చేసుకున్నారు అనేదే కథ. ఈ సినిమా చక్కటి కుటుంబ చిత్రంగా నిలిచింది. కృష్ణ వంశీ దర్శకత్వం చేసిన ఈ సినిమా కోసం ఇప్పటికీ ఎదురు చూసే ప్రేక్షకులు ఎందరో.

19. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు :

దర్శకుడు క్రాంతి మాదవ్ శర్వానంద్, నిత్యా మీనన్ తో రూపొందించిన ప్రేమకథా చిత్రం ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’. సినిమాలో ప్రేమంటే కేవలం అమ్మాయిని ప్రేమించడం కాదు. నువ్వు కోరుకున్న గమ్యాన్ని కూడా జయించడాన్ని కూడా ప్రేమించడమే అనే సందేశంతో వచ్చిన ఈ సినిమా మంచి పేక్షకాదరణ పొందింది. నిత్యా మీనన్, శర్వానంద్ అభినయం సినిమాకి ప్రధాన బలం. గోపి సుందర్ స్వర పరిచిన పాటలు ప్రేక్షకులను అలరించాయి.

20. మహర్షి  :

వంశీ దర్శకత్వంలో రాఘవ, శాంతి ప్రియ, కృష్ణ భగవాన్ లతో రూపొందిన ప్రేమ కథాచిత్రం ‘మహర్షి’. ఈ సినిమాలో తాను ప్రేమించిన అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకోవడంతో మానసికంగా మతి భ్రమించిన పాత్రలో రాఘవ నటన ఆయకట్టుకుంటుంది. సినిమాకి ఇళయరాజా పాటలు మరో ఆకర్షణ. సినిమా చివరికి విషాదంగా ముగుస్తుంది.

వీటితో పాటు ఎన్నో ప్రేమకథలు  మంచి విజయాన్ని సాధించాయి.

error: Content is protected !!