ఆమె కొంటె కళ్ళు  ఎన్నో భావాల్ని పలికిస్తాయి. ఆ  చిలిపి నవ్వు ఎన్నో కథల్ని వినిపిస్తాయి. దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవపారిజాతం ఆమె. అనితర సాధ్యమైన నటనతో భారతీయ ప్రేక్షకుల హృదయ సామ్రాజ్యాన్ని కొన్ని దశాబ్దాల పాటు  ఏలిన అతిలోక సుందరి ఆమె. పేరు శ్రీదేవి. ఆమె అభినయ దేవేరి. ఒకప్పుడు సౌత్ అండ్ నార్త్ లో తన పెర్ఫార్మెన్స్ తోనూ, గ్లామర్ తోనూ ప్రకంపనలు పుట్టించిన ఆ ఆకుచాటు పిందె.. కొమ్మ చాటు పువ్వు .. ఆ సిరిమల్లె పువ్వును  బ్రహ్మదేవుడు పూల రెక్కల్ని , కొన్ని చుక్కల్ని రంగరించి  బొమ్మగా చేసినట్టు అనిపిస్తుంది.  ఎనభై , తొంభైల్లో భారతీయ తెరను ఏక ఛత్రాధిపత్యంగా ఏలిన చరిత్ర ఆమెది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వందలాది సినిమాల్లో కథానాయికగా నటించింది శ్రీదేవి.

నాలుగో ఏటనే తమిళ సినిమాలో నటించింది శ్రీదేవి . ఆ తర్వాత తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లో కూడా బాలనటిగా వేసింది శ్రీదేవి. జూలీ సినిమాతో హిందీలోకి అడుగిడిన శ్రీదేవి తన పదహారో ఏట పదహారేళ్ల వయసు సినిమాలో చేసింది. అప్పట్లో ఆ సినిమా మంచి హిట్. ఇప్పుడు కూడా శ్రీదేవి పేరు చెబితే… చాలామందికి ఆ సినిమా గుర్తొస్తుంది.

గ్లామరూ, నటనా పటిమ ఉన్న శ్రీదేవి ఇటు దక్షిణాదిన, అటు ఉత్తరాదిన సినిమాల్లో తిరుగులేని మహారాణిగా కొన్నేళ్లు రాజ్యమేలింది. శ్రీదేవిని గ్లామర్ గాళ్ అని, బ్యూటీ క్వీన్ అనీ అనేవాళ్లు. హీరోలతో డ్యూయెట్లు పాడడమే కాదు…చాలా సినిమాల్లో మనల్ని కంట తడిపెట్టించే రోల్స్ కూడా వేసింది. పెళ్లయ్యాక కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఈ సిరిదేవి ఇంగ్లీష్ టు వింగ్లీష్ మూవీలో యాక్ట్ చేసి తన నటనా పటిమగాని, గ్లామర్ కానీ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకుంది. నేడు శ్రీదేవి వర్ధంతి. ఈ సందర్భంగా ఆ అతిలోక సుందరికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!