“మనసున మనసై …..బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే బాగ్యము….అదే స్వర్గము” విఫలమైన ప్రేమికుడితో విషాద గీతాన్ని పలికించినా… “నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖి మయూరివై వయ్యారివై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే” అంటూ ప్రియురాలు కోసం యుగళ గీతం పాడినా… “తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా దేశమాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయరా ” అని విప్లవాన్ని రగిలించినా…. “పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతికా  పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతికా ఆ ఆ” అంటూ భారతీయుడిని నిద్రలేపినా…  తన కవితలను,పాటలను సామాన్యప్రజలు సైతం పలికే విధంగా, పాడుకునేలా చేసిన అభ్యుదయ కవితా శక్తి  శ్రీశ్రీ.

20 శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన వ్యక్తి మహాకవి శ్రీశ్రీ.అయన అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు అయితే…శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు.శ్రీశ్రీ విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా,సినిమా పాటల రచయితగా ప్రసిద్ధిచెందాడాయన . 1947లో మద్రాసుకు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. తెలుగు వారిని ఉర్రూతలూగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను శ్రీశ్రీ రచించారు.అల్లూరి సీతా రామరాజు చిత్రానికి శ్రీశ్రీ రాసిన “తెలుగు వీర లేవరా..” అనేది ఆయన రాసిన ఆణిముత్యాల్లో ఒకటిగా  పేర్కొంటారు.తన భార్య సరోజతో కలిసి సినిమాలకు మాటలు రాసాడు.ప్రాసకూ, శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు.అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ మేటి. “వ్యక్తికి బహువచనం శక్తి” అనేది ఆయన సృజించిన మహత్తర వాక్యమే! శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించారు. కొన్ని కోట్ల మందిలో అక్షరాలతో ఆలోచనలు రేపి కార్మిక లోకానికి, శ్రామిక వర్గానికి రచనలతో…వచనాలతో తెలుగు సాహితీ ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని  ఎందరికో  ఆదర్శప్రాయులైన “శ్రీశ్రీ” వర్ధంతి  నేడు. ఈ సందర్భంగా ఆ మహాకవికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!