చంద్రబింబం లాంటి ముఖం.. కలువరేకుల్లాంటి కళ్ళు.. ఉన్నట్టా లేనట్టా అన్నట్టే ఉండే నడుము.. చక్కటి శరీర సౌష్టవం.. కలగలిస్తే .. శిల్పా శెట్టి. ‘సాహసవీరుడు సాగరకన్య’ చిత్రంలో నటించినప్పటి నుంచీ ఆమె తెలుగు ప్రేక్షకులకు సాగరకన్యే. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకాదరణ పొందింది శిల్పా శెట్టి . మోడల్‌గా తన జీవితాన్ని ప్రారంభించి నటిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఎన్నో అవకాశాలు చేజిక్కించుకుంది. బాలీవుడ్లో ‘బాజీగర్’ సినిమాతో చిత్రసీమలో అడుగిడింది. తొలి చిత్రంలో అద్భుతమైన నటనతో మెప్పించింది. ఆ తర్వాత ‘మై కిలాడీ తూ అనారీ’ చిత్రం బాలీవుడ్లో ఆమెను నిలిపేలా చేసింది. మళ్లీ వరుసగా పరాజయాలను మూటకట్టుకుంది. అప్పుడొచ్చింది ‘దడ్కన్’ సినిమాలో అవకాశం. ఆ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. ‘పర్దేశీ బాబు’ నాటకంతో అభిమానుల మన్ననలు పొందింది. ఎయిడ్స్ బాధితుల కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఫిర్ మిలేంగే’తో అంతర్జాతీయస్థాయి గుర్తింపు పొందింది. ‘బిగ్‌బాస్’ కార్యక్రమంతో మంచి పేరు తెచ్చుకుంది. ‘దిక్షియాయూన్’ చిత్రంతో నిర్మాతగా మారింది. జంతు సంరక్షణకు పాటుపడుతోంది. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు యజమానిగా వ్యవహరిస్తోంది. యోగా శిక్షకురాలిగా ప్రసిద్ధి పొందింది. యోగాసనాలతో కూడిన సీడీలను విడుదల చేసింది. భారతీయ వంటలపై ఓ పుస్తకాన్ని కూడా వెలువరించింది. నేడు శిల్పా శెట్టి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.