Shopping Cart 0 items - $0.00 0

మెలోడీ మాస్టర్

 

 

సినీ సంగీతానికి సంబంధించి మెలోడీ అనే పదానికి పర్యాయ పదం సత్యం. అద్భుతమైన జ్నాపక శక్తి , విషయ పరిజ్నానం, సునిశిత పరిశీలన ఆయన ప్రత్యేకతలు. ఒక పాట బీటును బట్టి, దాని సౌండ్ ను బట్టి అది సత్యం కంపోజ్ చేసిన పాటేనని చాలా తేలిగ్గా గుర్తించవచ్చు. అదే తన బలంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 500 పైచిలుకు చిత్రాలకు సంగీతాన్నందించి.. అదే తన జీవితంగా తన ప్రస్థానాన్ని సాగించారు ఆయన. 1933లో విజయనగరం జిల్లా పార్వతీ పురంలో జన్మించిన సత్యంలో చిన్ననాటి నుంచే సంగీతం పట్ల మక్కువ ఎక్కువే. ఆయన తాతగారు హరికథా భాగవతార్ కావడమే దానికి కారణం. ఆ ప్రోత్సాహం కారణంగానే సత్యం పదేళ్ళ వయసులోనే సంగీత పాఠాలు నేర్చుకున్నారు. యుక్త వయసు వచ్చిన తర్వాత సినీ సంగీత దర్శకుడు ఆధినారాయణ రావు ఆర్కెస్ట్రాలోని ఒక తబలా నిపుణుడి దగ్గర డోలక్ ఎలా వాయించాలో పరిశీలించి.. టి.వీ రాజు దగ్గర ఆర్కెస్ట్రాలో ఎనిమిదేళ్ళు పనిచేశారు సత్యం.

1962వ సంవత్సరంలో “శ్రీ రామాంజనేయ యుద్ధ” అనే కన్నడ సినిమాకి మొదటిసారిగా సంగీత దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్నారు సత్యం . ఈ అవకాశాన్ని నూటికి నూరు పాళ్ళు సద్వినియోగం చేసుకున్నారాయన. మొదట్లో తెలుగులో అడప దడప సినిమాలు చేస్తూన్నా మంచి గుర్తింపు రాలేదు ‘ ఈలోపు కన్నడంలో 42 సినిమాలకు స్వరకల్పన చేశాక 1973 లో “కన్నె వయసు” సినిమా తరువాత ..  తెలుగులో ఇక  వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. సత్యం స్వరజీవితంలోనే అగ్రతాంబూలం ఇవాల్సిన “ఏ దివిలో విరిసిన పారిజాతమో” పాట ఈ సినిమాలోనిదే. ఇలా తన 20 ఏళ్ల సినీ జీవితంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు. కృష్ణంరాజు, చిరంజీవి వంటి అగ్రతారల చిత్రాలకు విజయవంతమైన సంగీతం అందించారు. 70 వ దశకంలో దాదాపు కృష్ణ నటించిన అన్నీ కౌబాయ్ చిత్రాలకు సత్యమే స్వరసారథి. నటుడు చలం నిర్మాతగా తీసిన మరియు హీరోగా నటించిన దాదాపు 20 సినిమాలకు సత్యమే ఆస్థాన సంగీత దర్శకుడు. సత్యానికి బాగా ఇష్టమైన వాద్యం తబలా. తబలా లేకపొతే సత్యం సంగీతం లేదు అని చాలాసార్లు చెప్పేవారు. రీరికార్డింగ్ సమకూర్చడంలో సత్యానిది ఓ ప్రత్యేక శైలి. ఆ మహా సంగీత దర్శకుడి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా మూవీ వాల్యూమ్ ఆయనకు ఘననివాళులర్పిస్తోంది.

Leave a comment

error: Content is protected !!