బాలీవుడ్ తెరపై ఒకప్పుడు కమనీయ కావ్యాల్ని,  రమణీయ దృశ్యాల్ని పండించిన కలల కర్షకుడు ఆయన. బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే వెండితెరకు వెన్నెల రంగులు అద్దిన సెల్యులాయిడ్ చిత్ర కారుడు ఆయన. ప్రేమ కథల్ని కొత్త కోణంలో ఆవిష్కరించి .. ప్రేక్షకుల చేత కంట తడిపెట్టించి.. గుండెల్ని పిండేసిన కరుడు గట్టిన దార్శనికుడు ఆయన. భారతీయ తెరను  తన సినిమాలతో సగర్వంగా వెలిగించిన అసమాన నటుడు ఆయన.  ఆయన పేరు రాజ్ కపూర్. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా రాజ్‌కపూర్‌ సేవలు అనుపమానం.. అమోఘం.. అద్భుతం… అద్వితీయం. తెరపై భావోద్వేగాల్ని పతాకస్థాయిలో పండించి హృదయాల్ని ఆవిష్కరించడం, నవ్వినా, ఏడ్చినా కన్నీళ్లే వస్తాన్న తాత్వికతని అసాంతం అర్థం చేసుకుని తెరపై నవ్వుతూ ప్రేక్షకుల్ని ఏడ్పించడం కూడా రాజ్‌కపూర్‌కే చెల్లు.

ఒకప్పటి ప్రముఖ  నటుడు పృథ్వీరాజ్‌ కపూర్‌, రామ్‌సరణి దేవీకపూర్‌ దంపతులకు  రాజ్‌కపూర్‌ జన్మించారు. 1935లో తన పదడకొండో ఏట రాజ్‌కపూర్‌ ‘ఇంక్విలాబ్‌’ చిత్రంలో బాలనటుడిగా తెరపై కనిపించారు. ఆ తర్వాత ‘హమారీ బాత్‌, ‘గౌరీ’, ‘వాల్మీకి’, ‘జైల్‌యాత్ర’, ‘దిల్‌కిరాణి’, ‘చిట్టూర్‌ విజయ్‌’ లాంటి సినిమాల్లో 1947 వరకూ వివిధ పాత్రలు పోషిస్తూ వచ్చిన రాజ్‌కపూర్‌కి చెప్పుకోదగ్గ విజయాన్నిచ్చిన సినిమా 1947లో విడుదలైన ‘నీల్‌కమల్‌’. ఈ చిత్రంలో మధుబాల హీరోయిన్‌గా మొదటిసారి నటించింది. 1948లో ఆర్‌.కె. ఫిల్మ్స్‌ బ్యానర్‌ స్థాపించి ఎన్నో.. ఎన్నెన్నో వైవిద్యభరితమైన చిత్రాలకు రూపకల్పన చేసి తనదైన శైలిని తెరపై ఆవిష్కరించడంలో రాజ్‌కపూర్‌ కృతకృత్యులయ్యారు. ఆయన సినీ కెరీర్ లో  ఆగ్ , ఆవారా, శ్రీ 420, మేరా నామ్ జోకర్, సంగం, జిస్ దేశ్ మే గంగా బెహతీహై, సత్యం శివం సుందరం లాంటి ఎన్నో సినిమాలు బాలీవుడ్ చరిత్రలో క్లాసిక్స్ గా మిగిలిపోయాయి. 988లో అత్యంత ప్రతిష్టాతకమైన దాదాఫాల్కే అవార్డు స్వీకరణోత్సవంలో ఆస్తమా కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డ రాజ్‌కపూర్‌ దగ్గరకే వేదిక దిగివచ్చిన అనాటి రాష్ట్రపతి వెంకటరామన్‌ అవార్డు ఇచ్చారు. వెన్వెంటనే హాస్పిటల్‌కి ఆయన్ని  హుటాహుటిన తరలించారు. దాదాపు నెలతర్వాత ఆయన తుది శ్వాస విడిచారు. నేడు రాజ్ కపూర్ వర్ధంతి. ఈ సందర్భంగా ఆ వెండితెర చిత్రకారుడికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

 

 

Leave a comment

error: Content is protected !!