నవ్వులతో హిప్నాటిజం చేస్తాడు. అందరినీ హాస్యంతో కనికట్టు చేస్తాడు. తాను నవ్వక.. ఇతరులను నవ్వించే టాలెంట్ ఆయనకే సొంతం. పాత్ర పాత్రకీ వైవిధ్యమైన మేనరిజం అద్ది.. దానికి తన నవ్వుల ముద్ర వేయడం ఆయనకు జోకు తో పెట్టిన విద్య. విచిత్రమైన హావభావ విన్యాసాలతో .. వింతగొలిపే కామెడీ డిక్షన్ తో పడిపడి దొర్లేలా  నవ్వించి.. ప్రేక్షకుల పొట్టచెక్కలు చేయడం  ఆయన ట్రేడ్ మార్క్ స్టైల్. పేరు రాజేంద్రప్రసాద్ . టాలీవుడ్ ప్రేక్షకులకు ఆయన ఎవర్ గ్రీన్ కామెడీ కింగ్.

బాపు ‘స్నేహం’ చిత్రంతో నటుడిగా పరిచయమైన రాజేంద్రప్రసాద్  ఆ తరువాత ‘ఛాయ’, ‘నిజం’, ‘ఆడది గడప దాటితే’, ‘మూడు ముళ్ల బంధం’, ‘దారి తప్పిన మనిషి’, ‘ఈ చరిత్ర ఏ సిరాతో’, ‘మంచుపల్లకి’, ‘కలవారి సంసారం’, ‘ముందడుగు’, ‘పెళ్ళిచూపులు’, ‘రామరాజ్యంలో భీమరాజు’ తదితర చిత్రాలతో దూసుకెళ్లారు. వంశీ దర్శకత్వం వహించిన ‘లేడీస్‌ టైలర్‌’ నుంచి ఆయన ప్రయాణం మరో మలుపు తిరిగింది. ‘రెండు రెళ్లు ఆరు’, ‘సంసారం ఒక చదరంగం’, ‘ప్రేమించి చూడు’, ‘ఏప్రిల్‌ ఒకటి విడుదల’, ‘చెవిలో పువ్వు’, ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీసు’, ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’, ‘ప్రేమ తపస్సు’, ‘పెళ్లిపుస్తకం’, ‘అప్పుల అప్పారావు’, ‘ఎర్రమందారం’, ‘పెళ్లానికి ప్రేమలేఖ ప్రియురాలికి ప్రేమలేఖ’, ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘రాజేంద్రుడు గజేంద్రుడు’, ‘కన్నయ్య కిట్టయ్య’, ‘అలీబాబా అరడజను దొంగలు’, ‘అక్క పెత్తనం చెల్లెలి కాపురం’, ‘మాయలోడు’, ‘మిస్టర్‌ పెళ్లాం’, ‘పేకాట పాపారావు’, ‘మేడమ్‌’, ‘అల్లరోడు’, ‘పరుగో పరుగు’ ఇలా జైత్రయాత్ర కొనసాగించారు. ‘క్విక్‌గన్‌ మురుగన్‌  అనే చిత్రంతో హాలీవుడ్‌లోకీ అడుగుపెట్టారు. ఇటీవల కాలంలో తన వయసుకు తగ్గ పాత్రల్ని ఎంపిక చేసుకొంటూ, క్యారెక్టర్‌ నటుడిగా సినిమాలపై తనదైన ప్రభావం చూపిస్తున్నారు. ఒకపక్క ‘మీ శ్రేయోభిలాషి’, ‘ఆ నలుగురు’, ‘ఓనమాలు’ వంటి చిత్రాలు చేస్తూనే, క్యారెక్టర్‌ నటుడిగా ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. 42 యేళ్ల సుదీర్ఘ నట ప్రయాణంలో ఆయన 200కిపైగా సినిమాలు చేశారు. ‘ఎర్రమందారం’‘ఆ నలుగురు’  చిత్రాలకిగానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకొన్నారాయన. నేడు రాజేంద్రప్రసాద్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!