ఆయన చూడ్డానికి విలన్ లా ఉంటాడు. కానీ ఆయన కామెడీ చేస్తే ..ఎవరైనా పొట్ట చేత్తో పట్టుకొని కింద పడి దొర్లాల్సిందే. విచిత్రంగా విరిచే ఆయన డైలాగులకు, వింతగా ధ్వనించే ఆయన కంఠ విన్యాసానికీ నవ్వని వారెవరు?  ఈ లక్షణాల వల్లనే కెరీర్ బిగినింగ్ లో సీరియస్ గా విలనిజాన్ని పండించినా.. ఆయనను ఎక్కువగా కామెడీ పాత్రలే వరించాయి. ముఖ్యంగా ఇవివి సత్యనారాయణ లాంటి దర్శకులు ఆయన కోసం ప్రత్యేకంగా పాత్రలు సృష్టించేవారంటే.. ఆయన హాస్య చతురతకు ఇంతకన్నా నిదర్శనమేముంది? ఆ కమెడియన్ పేరు రఘుబాబు. టాలీవుడ్ వెటరన్ యాక్టర్ గిరిబాబు తనయుడిగా .. తండ్రి పేరు నిలబెడుతూ.. కొన్ని దశాబ్దాలుగా తెలుగులవారిని నవ్విస్తునే ఉన్నారు ఆయన.

ప్రకాశం జిల్లా రావినూతలలో జన్మించిన రఘుబాబుకి చిన్నతనం నుంచీ నాటకాలంటే పిచ్చి. వృత్తి రీత్యా చెన్నై మకాం పెట్టిన గిరిబాబు.. రఘుబాబును మాత్రం తన తండ్రి దగ్గరే ఉంచి చదివించేవారు. ఆ తర్వాత చెన్నైలో ఇంజినీరింగ్ వరకూ చదువు పూర్తి చేసి.. సినీరంగం వైపుకు అడుగులు వేశారు రఘుబాబు. అసలు తనకి నటుడిగా చేయాలనే కోరిక  ఏమాత్రం లేని రఘుబాబు.. తన తండ్రి సినిమాల విషయాల్ని చూసుకోవాలని, అటుపై ఏ  నిర్మాతగానో, దర్శకుడిగానో మారాలని అనుకున్నారు. అయితే అనుకోకుండా.. దర్శకుడు సత్యారెడ్డి ‘దొంగలున్నారు జాగ్రత్త’ చిత్రం లో హీరో అయ్యారు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో పలు పాత్రలు పోషించినా.. సరైన గుర్తింపురాలేదు. అయితే కృష్షారెడ్డి మురారి, వినాయక్ ఆది, చెన్నకేశవరెడ్డి చిత్రాల్లోనూ, యజ్నంలోనూ  విలనిజాన్ని పండించిన రఘుబాబు.. సినీ కెరీర్ ను కబడ్డీ కబడ్డీ చిత్రం అనూహ్య మలుపు తిప్పింది. అందులో ఆయన పోషించిన పాత్ర ఆయన్ను టాలీవుడ్ లో పెర్మినెంట్ కమెడియన్ ను చేసేసింది. ఆపై బెట్టింగ్ బంగార్రాజు, బెండు అప్పారావు ఆర్.యం.పి , అత్తిలి సత్తిబాబు లాంటి చిత్రాల్లో ఆయన కామెడీ ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది. ఆపై లెక్కలేనన్ని చిత్రాల్లో రఘుబాబు హాస్యం .. ప్రసిద్ధికెక్కింది. ప్రస్తుతం రఘుబాబు పలు చిత్రాల్లో.. కేరక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. అయినప్పటికీ ఆయనలోని హాస్యనటుడు ఆ పాత్రలకు అదనపు ఆకర్షణగా మారతాడు. నిజానికి చిన్నకొడుకును హీరోగా చేయాలనుకున్న గిరిబాబు.. రఘుబాబు ఇంత క్రేజీ , బిజీ ఆర్టిస్ట్ అవుతాడని ఊహించలేదని ఇప్పటికీ చెబుతూంటారు. నేడు రఘుబాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ విలక్షణ హాస్యనటుడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే రఘుబాబు…

Leave a comment

error: Content is protected !!