ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నిటినీ గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనాపై అన్ని దేశాలు కూడా గట్టిగా యుద్ధాన్ని ప్రకటించి లాకౌట్ తో అందరినీ ఇంటికే పరిమితం చేశారు. అయితే దీనివలన ప్రజలందరూ ఎటువంటి పనులు లేక ఇంటికే పూర్తిగా పరిమితం కావాల్సి వచ్చింది దానితో ఇల్లు గడిచే పరిస్థితి లేక పేద – దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే వారిని ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్యాకేజీలను ప్రకటించడం జరిగింది. వారికి తోడుగా ప్రముఖ పారిశ్రామికవేత్తల నుంచి సినీ సెలబ్రిటీల వరకూ తమ వంతు సాయం చేస్తున్నారు. కరోనా వైరస్ బాధితుల సహాయార్థం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నారు..
కరోనాపై పోరాటానికి తెలుగు సినిమా హీరో నితిన్ తో మొదలైన ఆర్ధికసాయం ఇప్పుడు ఊపందుకుంది. అందులో భాగంగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి – సూపర్ స్టార్ మహేష్ బాబు – రామ్ చరణ్ – మంచు మనోజ్ – రాజశేఖర్ – అల్లరి నరేష్ – దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ – కొరటాల శివ – వివి వినాయక్ – అనిల్ రావిపూడి వంటి వారు ముందుకు వచ్చి తమ వంతుగా విరాళాలు అందించడం జరిగింది. తాజాగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా భారీగానే విరాళం అందించాడు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఏకంగా కోటి రూపాయల విరాళం అందించాడు. అలాగే కేంద్రానికి రూ. 3కోట్లు భారీ విరాళం అందించి పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నాడు. దాంతో పాటు కరోనా వైరస్ అరికట్టడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు – చేస్తున్న చర్యలపై ప్రశంసించాడు.