ప్రపంచాన్ని ఒణికిస్తోంది కరోనా వైరస్. మన దేశంలో రోజు రోజుకూ పాజిటీవ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. దానికి ఒకటే మార్గం. వీలైనంత వరకూ ఇంట్లోనే గడపడం. లాక్ డౌన్ ను వంద శాతం పాటించడం. అలా ఇంటికే పరిమితమైన వాళ్ళలో రోజు కూలీలు కూడా ఉన్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన రోజు కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారందరినీ ఆదుకోడానికి అవతరించిందే కరోనా క్రైసిస్ చారిటీ. ఈ పోరాటం లో తెలుగు సినిమా పరిశ్రమ స్పందించినట్లుగా దేశంలో మరే ఫిలిం ఇండస్ట్రీ స్పందించలేదన్నది వాస్తవం. మిగతా ఇండస్ట్రీల కంటే ముందు మన సినీ తారలు విరాళాల దిశగా ముందడుగు వేశారు. భారీ ఎత్తున విరాళాలు ప్రకటించారు. దీనికి తోడు మన సెలబ్రెటీలు కరోనాపై అవగాహన పెంచడంలో సేవా కార్యక్రమాలు చేపట్టడంలో చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి పరిశ్రమను ముందుండి నడిపిస్తున్నారీ విషయంలో. తాజాగా కరోనా మీద అవగాహన పెంచే దిశగా చిరు ఆధ్వర్యంలో ఒక పాట కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో లో చిరుతో పాటు నాగార్జున వరుణ్ తేజ్ సాయిధరమ్ తేజ్ కూడా కనిపించారు. జనాలకు మంచి సందేశం ఇచ్చారు.
ఈ వీడియో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వరకు వెళ్లింది. దీనిపై ఆయన స్పందించారు. మోడీ తెలుగులో టాలీవుడ్కు కృతజ్ఞతలు చెప్పడం విశేషం. ఈ వీడియోలో కనిపించిన నలుగురికీ పేరు పేరునా ఆయన ధన్యవాదాలు తెలిపాడు. ‘‘చిరంజీవి గారికీ నాగార్జున గారికీ వరుణ్ తేజ్ కీ సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు. అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం. అందరం సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం’’ అని తన ట్వీట్లో మోడీ పేర్కొన్నారు . మోడీ ట్విట్టర్ అకౌంట్ నుంచి లా ఓ తెలుగు సందేశం పోస్ట్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేదే. ప్రస్తుత తరుణంలో ఇలాంటి స్పందన టాలీవుడ్ కు మరింత ఉత్తేజాన్నిస్తుందనడంలో సందేహం లేదు. చిరు నాగార్జున తదితరులు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.
Thank you Shri @narendramodi ji for your kind words. Heartily appreciate your tireless efforts to contain the damage from #CoronaCrisis to our country. We are doing our little bit to partake in this humongous task. సంగీత దర్శకుడు కోటి గారు & మా అందరి తరుపున మీకు నా ధన్యవాదాలు https://t.co/K7bCljEakG
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 4, 2020