ఆయన ఆలోచనలు భారీగా ఉంటాయి. ఆయన కథలు అత్యంత భారీతనంతో వెండితెరను ఆవిష్కరిస్తాయి. ఆయన మేథస్సు ఆయన వేయించే సినిమా సెట్స్ అంతటి విశాలంగా ఆయన మస్తిష్కంలో నిక్షిప్తమై ఉంటుంది.  ఆయన రాసుకొనే కథాంశాలు .. ఆయన దర్శకత్వ ప్రతిభను ఎలివేట్ చేసే విధంగా ఉంటాయి. ఆయన సినిమాలోని హీరోల కేరక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉండి.. వారి ఇమేజ్ ను రెట్టింపు చేసే విధంగా ఉంటాయి. ఆ దర్శక శేఖరుడు గుణశేఖర్. టాలీవుడ్ లో భారీ చిత్రాలకు పెట్టని కోట ఆయన.

‘లాఠీ’ చిత్రంతో టాలీవుడ్ లో దర్శకుడిగా ప్రయాణం మొదలు పెట్టిన గుణశేఖర్ .. ఆ సినిమాతో అంతగా పేరు తెచ్చుకోలేకపోయారు. అయితే ..ఆ తర్వాత విడుదలైన. ‘సొగసు చూడతరమా’ చిత్రం మాత్రం ఆయనలోని భావకుడిని తట్టి లేపింది. ఆ తర్వాత చిన్నారులతో ‘రామాయణం’ తెరకెక్కించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్నారు. ఈ చిత్రంతోనే ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌ బాలరామునిగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ తర్వాత చిరంజీవితో ‘చూడాలని ఉంది’ తెరకెక్కించి ఘన విజయాన్ని సొంతం చేసుకొన్నారు గుణశేఖర్ . ‘మనోహరం’ కూడా గుణశేఖర్‌కి మంచి పేరు తీసుకొచ్చింది. ఇక  ఆ తర్వాత ‘మృగరాజు’ పరాజయాన్ని చవిచూసినా… ‘ఒక్కడు’ సంచలనాల్ని సృష్టించింది. ఆ చిత్రం కోసం వేసిన ఛార్మినార్‌ సెట్టు గురించి పరిశ్రమ జనాలు ప్రత్యేకంగా మాట్లాడుకొన్నారు అప్పట్లో. ఆ వెంటనే మహేష్‌తోనే ‘అర్జున్‌’ తెరకెక్కించారు. ‘సైనికుడు’, ‘వరుడు’, ‘నిప్పు’ ఇలా వరుస పరాజయాలు గుణశేఖర్‌ కెరీర్‌ని దెబ్బతీశాయి. 2015లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘రుద్రమదేవి’తో మళ్లీ పుంజుకొన్నారు గుణశేఖర్ . ఆ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు, స్వయంగా నిర్మించడం విశేషం. ప్రస్తుతం సమంత తో శాకుంతలం చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.  తెలుగులో భారీ హంగులతో చిత్రాల్ని తీయడంలో ఒక కొత్త ఒరవడిని నాంది పలికిన దర్శకుడిగా గుణశేఖర్‌ టాలీవుడ్ లో నిలిచిపోయారు. ఈ రోజు గుణశేఖర్ పుట్టినరోజు . ఈ సందర్భంగా ఆ దర్శక శేఖరుడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!