ఆయన ముందు బహుముఖ ప్రజ్నాశాలి అనే పదం కూడా చాలా చిన్నదైపోతుంది. ఏరంగంలో అడుగుపెట్టినా.. ఆ రంగంలో ఆయన మాస్టర్. దర్శకత్వం దగ్గర నుంచి కళా దర్శకత్వం వరకూ, ఎడిటింగ్ దగ్గరనుంచి , సినిమాటో గ్రఫీ వరకూ ఇలా ప్రతీ రంగంలోనూ ఆయన చాలా నిష్ణాతుడు. ద్రష్టగా, కళా స్రష్టగా ప్రపంచ సినీ మేథావుల చేత కొనియాడబడిన ఆ అద్భుత దర్శకుడు సత్యజిత్ రే. బెంగాల్ సినీ రంగంలో ఆయనొక మణిపూస. అపూర్వ కళాకౌశలంతో పాటు .. కథాకథనాల్లో భారతీయత, సూటిదనం , నిజాయితీ ఆయన శైలి. 20వ శతాబ్దపు అత్యుత్తమ భారతీయ దర్శకుల్లో సత్యజిత్ రే ఒకరు.
కలకత్తాలో ఒక ప్రముఖ బెంగాలీ కళాకారుల కుటుంబములో జన్మించిన సత్యజిత్ రే సినిమాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు కలిపి మొత్తము ముప్పై ఏడు చిత్రాలకు దర్శకత్వము వహించారు. ఆయన మొదటి సినిమా ‘పథేర్ పాంచాలీ’ కేన్స్ చలనచిత్రోత్సవములో 11 అంతర్జాతీయ బహుమతులు గెలుచుకుంది. ఆయనకి దర్శకత్వమే కాక, సినిమా తీయడంలోని ఇతర విభాగాల పట్ల కూడా మంచి పట్టు ఉంది. తన సినిమాలో చాలా వాటికి స్క్రీన్ ప్లే, కేస్టింగ్, సంగీతము, సినిమాటోగ్రఫీ, కళా దర్శకత్వము, కూర్పు, పబ్లిసిటీ డిజైన్ చేసుకోవడము – వంటివి కూడా ఆయనే చూసుకునేవాడు. అంతేకాదు ఆయనకి మరో అలవాటు కూడా ఉంది. ఆయనొక గొప్ప చిత్రకారుడు కూడా. తన ప్రతీ సినిమాకి ఏ సీన్ కా సీన్ బొమ్మలతో తనే స్టోరీ బోర్డ్ రెడీ చేసుకొని దర్శకత్వం చేసేవారు. సినిమాలు తీయడమే కాక రాయ్ ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు కూడా రాసాడు. అలాగే, ఆయన ప్రచురణ కర్త కూడా. బెంగాలీ పిల్లల పత్రిక “సందేశ్”ను చాలా ఏళ్ళు నిర్వహించారు. అనేక అవార్డులు పుచ్చుకున్న రాయ్ 1992 లో ఆస్కార్ కూడా అందుకున్నారు. గౌరవ ఆస్కార్ పురస్కాన్ని అందుకున్న తొలి భారతీయునిగానూ, ఆపైన భారతరత్న పురస్కారం పొందిన తొలి చలనచిత్ర రంగప్రముఖునిగానూ నిలిచారు. తాను మరణించేందుకు 23 రోజుల ముందు ఆ పురస్కారాన్ని స్వీకరించి, తన చలనచిత్ర జీవితంలో ఇది అత్యంత గొప్ప విజయంగా ప్రకటించారు సత్యజిత్ రే.. నేడు ఆయన శత జయంతి. ఈ సందర్భంగా ఆయనకి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.