ఆయన పాటలు రసగుళికలు.. భావ మల్లికలు … శబ్దార్ధ వీచికలు .. జన హృదయ సంచికలు. తెలుగు సినీ సాహిత్యాంబోధిని తన రచనలతో చిలికించి.. అమృతధారలు వెలయించిన సాహితీ రుషి . ఆయన పేరు భాగవతుల శివ శంకర శాస్త్రి. కలం పేరు ఆరుద్ర. తెలుగు సాహితీ లోకానికి అభ్యుదయ సాహితీ సముద్రుడు ఆయన. ఒంటి చేత్తో 13 సంపుటాల ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ రచించి, భాషా సేవ చేసిన కృషీవలుడు. ‘త్వమేవాహం’, ‘కూనలమ్మ పదాలు’, ‘సినీవాలి’ వంటి కవితల నుంచి డిటెక్టివ్ కథల దాకా; ‘సాలభంజికలు’, ‘రాదారి బంగాళా’ వంటి నాటక సాహిత్య ప్రక్రియ నుంచి ‘ఆరుద్ర వ్యాస పీఠం’, ‘వేమన్న వాదం’ వంటి వ్యాస సంపుటాల దాకా; ‘వెన్నెల−వేసవి’ (తమిళ కావ్యం ‘కళింగత్తుపరణి’) వంటి అనువాద రచనల నుంచి ‘కొండగాలి తిరిగింది’ వంటి సినీ సాహిత్యం దాకా ఆరుద్ర కలం ముద్ర పడని సాహిత్యం లేదు. ఇక సినీ సాహిత్యంలోనూ అదే ముద్ర. దటీజ్ ఆరుద్ర.
పక్షిరాజా వారి ‘బీదలపాట్లు’ సినిమాలో ఆరుద్ర రాసిన పాటలకు వెండితెర సాక్ష్యంగా నిలవడంతో ‘ఓ చిలుకరాజా నీ పెళ్లెపుడయ్యా... నీ పెళ్లికి నాట్యం చేస్తా’ అనే పాటను ఆయన తొలిపాట అయింది. ఆ తర్వాత ఎన్నో సాంఘిక , జానపద, పౌరాణిక , చారిత్రక చిత్రాలతో పాటు.. లెక్కలేనన్ని భక్తి చిత్రాలకు కూడా ఆరుద్ర అద్భుతమై పాటలు రాశారు. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల ప్రభావ ప్రవాహంలో పడి తెలుగు సినిమాల్లో కూడా క్లబ్బు డ్యాన్సుల జోరు, నిషా పాటల ఖుషీలు ఎక్కువైనాయి. అటువంటి సందర్భాలకు పాటలు రాసేందుకు నిర్మాతలు, దర్శకులు ఆరుద్రనే ఆశ్రయించేవారు. ఆండ్రూ సిస్టర్స్ ఆలపించిన ‘డ్రింకింగ్ రమ్ అండ్ కోకాకోలా’ స్ఫూర్తితో ఆరుద్ర ‘తీస్కో కోకాకోలా − ఏస్కో రమ్ము సారా’ అని ‘రౌడీలకు రౌడీలు’ సినిమా కోసం పాట రాశారు. అలాగే దేవుడు చేసిన మనుషుల్లో ‘మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల’ పాట వంటి క్లబ్ సాంగ్ తదనంతర కాలంలో రాలేదనే చెప్పాలి. ఇంకా చెప్పుకుంటే డైమన్ రాణీ గులాబి బుగ్గ నీదే (నేరం నాదికాదు ఆకలిది), తాగాలి రమ్ మనమందరమ్ (దేవుడమ్మ), ఏస్కో నా రాజా ఏస్కో − ఆకేస్కో, వక్కేస్కో, ఆపైన చూస్కో (చిట్టి తమ్ముడు), మొదటి పెగ్గులో మజా − వేడి ముద్దులో నిషా (శ్రీమంతుడు), తకిట దిమితక తైతై తమాషా మైకం (మోసగాళ్ళకు మోసగాడు), ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపొని ధీరుడెవ్వరో (ఆరాధన) వంటి మైకం పాటలు కోకొల్లలు. అలాగే బాపు చిత్రాలకు ఆరుద్ర రెగ్యులర్ గా పాటలు రాసేవారు. నేడు ఆరుద్ర వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.