కామెడీ విలన్ గా … కమేడియన్ గా… కారక్టర్ ఆర్టిస్ట్ గా … ఇలా పాత్ర ఏదైనా అద్భుతంగా ప్రజంట్ చేసిన నిజమైన నటుడు సాక్షి రంగారావు.
సుమారు 450 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు ధరించిన సాక్షి రంగారావు విచిత్రంగా కన్యాశుల్కం రిహార్సల్స్ లో పాల్గొంటూ స్టేజ్ మీదే కుప్పకూలిపోయి కన్నుమూశారు.


ఆంధ్రా యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తూ రంగస్థలం మీద తన అద్భుతమైన వాచికంతో ఆకట్టుకున్న రంగారావు అనుకోకుండా బాపు రమణల కళ్లల్లో పడ్డారు.
ఇరవై ఐదేళ్ల వయసులో నడివయసు కరణం పాత్రతో సాక్షి సినిమాలో తళుక్కున మెరిసారు రంగారావు.
అప్పటిదాకా రంగారావుకు ఉన్న రంగావఝ్ఝల అనే ఇంటిపేరు
పోయి …ఆ ప్లేస్ లో సాక్షి వచ్చి చేరింది.
అంత ప్రభావం చూపించారు ఆ సినిమాలో. విన్నకోట రామన్న పంతులు లాంటి ఉద్దండుల మధ్య తనదైన ప్రత్యేకత చాటుకున్నారు.
భానుమతి గారు ముద్దుగా పసుపుకొమ్మూ అని పిల్చే … మట్టిలో మాణిక్యం లాంటి సినిమాల్లో కామెడీ విలన్ గా మెప్పించిన సాక్షిలోని అసలైన నటుడ్ని వాడుకున్నది మాత్రం బాపు, విశ్వనాథ్, జంధ్యాల, వంశీ లే.
జంధ్యాల తీసిన రెండు రెళ్లు ఆరు సినిమాలో సాక్షి రంగారావు కారక్టర్ కు టిపికల్ మేనరిజం పెట్టారు జంధ్యాల. మేనరిజమ్స్ ఏర్పాటు చేసి … పాత్రలను నడిపించడం లో మాస్టర్ కదా ఆయన.
గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో మాట్లాడాలండీ మీరు అని జంధ్యాల అనగానే …
ఓకే అనేసి సాక్షి రంగారావుగారు మాట్లాడిన పద్దతి వినితీరాల్సిందే … రెండు రెళ్లు ఆరు చూసేయండి ..
కామెడీ చేయడంలో సాక్షి రంగారావు టైమింగే టైమింగు.
స్వర్ణకమలంలో భక్తి ఎక్కువైపోయి ఇంట్లో ఉన్న దేవుళ్ల పటాలన్నీ మసిలో కప్పడిపోయేలా హారతులిచ్చే భార్యతో వేగే భర్తగా కనిపిస్తారు సాక్షి రంగారావు .
కారక్టర్ ను అర్ధం చేసుకుని డైలాగును స్వానుభవానికి తెచ్చుకుని నటిస్తే కానీ ఆ సిద్ది రాదు.
పాత్ర చిన్నదా పెద్దదా అని కాదు … మనం కనిపించినంత సేపూ ఆడియన్స్ అటెన్షన్ మనమీదే ఉండాలి. అదీ సాక్షి రంగారావు లెక్క.


సాగరసంగమంలో కమల్ హసన్ తల్లి సాక్షిరంగారావు క్యాటరింగు ట్రూప్ లో పనిచేస్తూ ఉంటుంది.
తల్లిని సాగనంపడానికి రైల్వే స్టేషన్ కు వచ్చిన కమల్ హసన్ ను గదమాయించే సీన్ నాకు చాలా ఇష్టం.
నువ్వెక్కూ … నువ్వు దిక్కూ అంటూ విచిత్రమైన తనకు మాత్రమే సాధ్యమైన మాడ్యులేషన్ లో చెలరేగిపోతాడు.
స్క్రీన్ మీద ఏ రసాన్నైనా అద్భుతంగా పలికించే నటుడు సాక్షి రంగారావు.
విలనీ చేశాడు. జనం మెచ్చుకున్నారు. కేవలం కామెడీ చేశాడు. జనం పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు.
సెంటిమెంట్ చేశాడు. జనం కళ్లు తుడుచుకోకుండా ఉండలేకపోయారు. సాక్షి రంగారావులోని ఈ అన్ని డైమన్షన్స్ నీ వాడుకున్న దర్శకుడు మాత్రం విశ్వనాథే.
శంకరాభరణంలో శంకరశాస్త్రి ట్రూప్ లో మృదంగం వాయించే పాత్ర సాక్షిది. కళకు కళతప్పిన సందర్భంలో శంకరశాస్త్రిని కల్సిన గోపాలం పాత్రలో సాక్షిగారు … ఎప్పటికీ గుర్తుండిపోతారు.
బాపుగారి రెండో సినిమా బంగారు పిచ్చికలో అతి క్రూర భయంకర విలనీ చేసేశాడు సాక్షి రంగారావు.
శాంతకుమారి సెక్రటరీ పాత్రలో చెలరేగిపోయాడు. చాలా వినయంగా కనిపిస్తూనే…నెమ్మదిగా వెనకాల గోతులు తవ్వే పాత్ర అది.
క్లైమాక్స్ లో విలన్ గా ఓపెన్ అయ్యే సీన్ లో సాక్షి రంగారావు నటన నాటి డైరక్టర్లను విపరీతంగా ఆకట్టుకుంది.
ఆ సినిమా దెబ్బతిన్నా…సాక్షి రంగారావుకు మాత్రం వరస ఆఫర్లు క్యూకట్టాయి.
అన్నీ నెగెటివ్ షేడ్స్ ఉన్న కారక్టర్లే.
ఇక విశ్వనాథ్ అయితే సాక్షి రంగారావు లేకుండా సినిమా తీయలేదు.
దాదాపు కళాతపస్వి డైరక్ట్ చేసిన ప్రతి సినిమాలోనూ సాక్షి రంగారావు ఏదో ఒక పాత్ర చేస్తూనే వచ్చాడు.
స్వాతి కిరణం వరకు ఈ అనుబంధం కొనసాగింది.
సిరివెన్నెల చిత్రంలో విశ్వనాథ్ ఓ ప్రయోగం చేశారు.
మిశ్రోకు తాత పాత్ర ఇచ్చి … ఆయన మనవడి పాత్రలో సాక్షి రంగారావును ప్రవేశపెట్టారు.
తాతగారు…అనే పదాన్ని విచిత్రంగా పలుకుతూ…డైలాగు చెప్పే తీరుకు ఆడియన్స్ అవాక్కయ్యారు.
ముప్పై రోజుల్లో ఏదైనా నేర్చుకోవచ్చు అంటూ మార్కెట్ లో పోటెత్తిన పుస్తకాల మీద సెటైరేస్తూ … సూత్రధారుల్లో శ్రీలక్ష్మి పాత్రను తీర్చిదిద్దారు విశ్వనాథ్.
ముప్పై రోజుల్లో కరాటే … ముప్పై రోజుల్లో కర్ణాటక సంగీతం ఇలాంటి పుస్తకాలు తెచ్చి ప్రయోగాలు చేసే భార్యకు భర్తగా సాక్షి రంగారావు జీవించారు.
తన భార్యను చూసి ఖంగారు పడుతున్న అన్నను ఓదార్చే సీన్స్ లో …
మీ మరదలు అన్నయ్యా … అని మళ్లీ డిపికల్ మాడ్యులేషన్ వేస్తాడు.


వంశీ సినిమాల్లోనూ సాక్షి రంగారావుకు తప్పనిసరిగా ప్లేస్ ఉండేది.
ఏప్రిల్ ఒకటి విడుదల లాంటి సినిమాల్లో కామెడీ చేయించాడు. మంచుపల్లకిలో సెంటిమెంట్ చేయించుకున్నాడు.
కానీ సితారలో మాత్రం గుర్తుండిపోయే పాత్ర ఇచ్చాడు. సాక్షి రంగారావు కూడా ఆ పాత్రలోకి పరకాయప్రవేశం చేశాడు. జమిందారుగారి దయ కోసం మాత్రమే కాదు … ఆయన ముందు కళా ప్రదర్శన చేయాలన్న తపనతో వచ్చిన భాగవతుల ట్రూపు నాయకుడుగా సాక్షి రంగారావు నటన గుర్తుండిపోతుంది.
నటుడిగా జీవితాంతం కొనసాగాలని, నటనకే జీవితాన్ని అంకితం చేసిన చాలామంది భావిస్తారు.
సాక్షిరంగారావు విషయంలో అది నిజమైంది.
‘కన్యాశుల్కం’ నాటకం రిహార్సిల్స్‌లో నటిస్తూ స్టేజ్‌మీద కుప్పకూలిపోయారు.
ఆ తర్వాత ఆసుపత్రిలో కోలుకుంటున్నారనుకుంటుండగా… కన్నుమూసి అభిమానులను ఏడిపించారు.

writer – Bharadwaja Rangavajhala

Leave a comment

error: Content is protected !!