చిత్రశిల్పి బాపు, రచనా శిల్పి ముళ్ళపూడి వెంకటరమణ కలయికలో తెరకెక్కిన క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ముత్యాల ముగ్గు. శ్రీరామచిత్ర బ్యానర్ పై మద్దాలి వెంకట లక్ష్మి నరసింహారావు నిర్మించిన ఈ సినిమా 1975లో విడుదలైంది. సరిగ్గా 45 ఏళ్ళు పూర్తి చేసుకొన్న ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలున్నాయి. శ్రీధర్, సంగీత జంటగా నటించిన ఈ సినిమాలో ..ఇంకా రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, కాంతారావు, ముక్కామల, మాడా వెంకటేశ్వరరావు, సూర్యకాంతం, జయమాలిని, నూతన్ ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఉత్తర రామాయణాన్ని సోషలైజ్ చేసి. తెరకెక్కించిన ఈ సినిమా.. అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది.
ఇక ఈ సినిమాలో కంట్రాక్టర్ పాత్రలో విలన్ గా నటించిన రావుగోపాలరావు.. డైలాగ్స్.. అప్పట్లో గ్రామఫోన్ రికార్డ్స్ లో విడుదలయ్యాయి. ఈ సినిమాతోనే రావుగోపాలరావు పేరు తెలుగు తెరమీద మారుమోగింది. ఆయన పలికిన డైలాగ్స్ ను ముళ్ళపూడి అద్భుతంగా రాశారు. కె.వి.మహదేవన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు అప్పట్లో చాలా పెద్ద హిట్టయ్యాయి. ఇప్పటికీ కూడా ఈ పాటలు ఏదో ఒక మూల వినిపిస్తూనే ఉంటాయి. ఇషాన్ ఆర్య ఛాయా గ్రహణం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది.