నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తన నటజీవితంలో ఎన్నో ఉత్తమ చిత్రాల్లో నటించి మెప్పించారు. అలాంటి వాటిలో ‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రం కూడా ఒకటి. అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ పై దుక్కిపాటి మధుసూదనరావు నిర్మాణంలో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1964, జూలై 10న విడుదలై అఖండ విజయం సాధించింది. నేటికి సరిగ్గా 56 సంవత్సరాలు పూర్తి చేసుకున్నఈ సినిమా తెలుగులో రూపొందించిన తొలి నవలా చిత్రంగా విశేషాన్ని సంతరించుకుంది. కోడూరి కౌసల్యాదేవి ‘చక్రభ్రమణం’ నవల ఆధారంగా ‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రం తెరకెక్కింది. సావిత్రి, షావుకారు జానకి కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో .. ఇంకా జగ్గయ్య, గీతాంజలి, సూర్యకాంతం, సంగమేశ్వరరావు , మురళీకృష్ణ , భాను ప్రకాష్ , గుమ్మడి, పద్మనాభం, చలం ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సాలూరి రాజేశ్వరరావు స్వరకల్పనలోని గీతాలు .. అప్పటిప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి.
1964 సంవత్సరానికి ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమా జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చలనచిత్రంగా ఎన్నికై రాష్ట్రపతి రజత పతకాన్ని గెలుచుకుంది. 1964లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ చలనచిత్రాలకు నంది అవార్డులను ప్రవేశపెట్టింది. ప్రథమ బహుమతిగా తొలి బంగారు నంది పురస్కారం ఈ చిత్రానికే దక్కటం విశేషం. ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమా 5 కేంద్రాల్లో 100 రోజులపైనే ఆడింది. ఈ సినిమా విజయంతోనే అక్కినేని, ఆదుర్తి ‘చక్రవర్తి చిత్ర’ సంస్థను స్థాపించి ‘సుడిగుండాలు’, మరో ప్రపంచం’ వంటి ప్రయోగాత్మక చిత్రాలు నిర్మించారు.