ఒకప్పుడు బాలీవుడ్ లో ఆయన పేరు చెబితే .. యువతలో ఉత్సాహం ఉప్పొంగేది . ఆయన డ్యాన్సులకు బాలీవుడ్ జనం బ్రహ్మరథం పట్టేవారు. మాతృభాష బెంగాలీ అయినా.. హిందీలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకోవడమే ఆయన టాలెంట్ . తొలి చిత్రంతోనే జాతీయ అవార్డు అందుకొని.. ఆ తరం ప్రేక్షకుల్ని సరికొత్త డ్యాన్సింగ్ ప్రక్రియతో అలరించిన ఆ డిస్కో యాక్టర్ మరెవరో కాదు మిథున్ చక్రవర్తి. అప్పట్లో డిస్కో డాన్సర్ గా బాలీవుడ్ యువత గుండెల్లో గూడు కట్టుకొన్న ఈ హీరో.. ఆ క్రేజ్ తోనే బాలీవుడ్ లో చాలా కాలం పాటు తన హవా కొనసాగించాడు.
మిథున్ అసలు పేరు గౌరాంగ్ చక్రవర్తి. తూర్పు బెంగాల్‌లోని బరిసలల్ లో పుట్టిన మిథున్, కృషి ఉంటే ఉన్నత శిఖరాలను అందుకోవచ్చని నిరూపించాడు. మిథున్ నటించిన మొదటి సినిమా ‘మృగయా’. మృణాల్‌సేన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1976లో విడుదలై మిథున్‌కు జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. మొదట్లో జూనియర్ ఆర్టిస్ట్ గా నట జీవితాన్ని ప్రారంభించిన మిథున్, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని స్టార్ హోదాను అందుకున్నాడు. నటనలో మాత్రమేకాదు వ్యాపార, వాణిజ్య, సామాజిక సేవారంగాల్లో సేవలందించాడు. రాజకీల్లోకి అడుగుపెట్టి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ‘డిస్కోడాన్సర్ ’ చిత్రంలో ‘జిమ్మీ’గా మిథున్ పోషించిన పాత్ర ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. సోవియట్ యూనియన్,రష్యా వంటి దేశాల్ల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. హిందీ, బెంగాలీ, భోజ్‌పురి, తమిళ్, తెలుగు, కన్నడ పంజాబీ భాషల్లో మొత్తం 350 చిత్రాల్లో మిథున్ నటించారు. మోనార్క్ గ్రూప్ ద్వారా విద్య, వైద్యరంగాల్లో సేవలందిస్తున్నారు. 1992లో సునీల్‌దత్, దిలీప్‌కుమార్‌లతో కలిసి సినీ, టీవీ ఆర్టిస్టుల అసోసియేషన్‌ను ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న సినీ రంగకళాకారుల కష్టాలను తీర్చేందుకు కృషి చేశారు. గ్రాండ్ మాస్టర్‌గా లిమ్కా బుక్ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. నేడు మిథున్ చక్రవర్తి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ డిస్కో డాన్సర్ కు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.