వైవిధ్యమైన కథలు ఎంపికచేసుకొని , విభిన్నమైన పాత్రలు చేయడంలో కమల్ హాసన్ తర్వాత స్థానంలో నిలుస్తాడు చియాన్ విక్రమ్. ప్రయోగాలు చేయడంలో ముందు వరుసలో ఉండే ఈ తమిళ స్టార్ హీరో .. కొంతకాలంగా సరైన విజయం సాధిచడంలో వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. అయినా ఎప్పటికప్పుడు తన ప్రయత్నం మాత్రం మానడం లేదు. ప్రస్తుతం అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో `కోబ్రా` సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో విక్రమ్ పలు గెటప్స్‌లో కనిపిస్తాడట. అలాగే మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ `పొన్నియన్ సెల్వన్` చిత్రంలో కూడా విక్రమ్ ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలు రన్నింగ్‌లో ఉండగానే విక్రమ్ మరో ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. విక్రమ్‌కు ఇది 60వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాకి సంబంధించి మరో విశేషం ఉంది. అదేమిటంటే విక్రమ్ కుమారుడు ధృవ్ కూడా ఈ సినిమా నటించడం. `అర్జున్‌రెడ్డి` చిత్రం తమిళ్ రీమేక్‌లో హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్న ధృవ్ తన తండ్రితో కలిసి ఈ సినిమాలో నటించనున్నాడు. విక్రమ్‌తోపాటు ధృవ్ క్యారెక్టర్‌కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్‌తో `మాస్టర్` చిత్రాన్ని నిర్మిస్తున్న సెవన్ స్ర్కీన్ స్టూడియో సంస్థ ఈ చిత్రాన్నినిర్మిస్తోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని తాలూకా పోస్టర్ కు మంచి అప్లాజ్ లభిస్తోంది. రక్తంతో తడిసిన ఒక చేతిలోని తుపాకీని మరో చెయ్యి అందుకొనే ఈ లుక్ ఆకట్టుకుంటోంది.