అందం, అభినయం మెండుగా..నిండుగా కలిగిన నటీమణులు చాలా అరుదుగా ఉంటారు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ.. ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించడం.. చాలా కొద్ది మందికే సాధ్యం. అలాంటివారిలో ప్రియమణి ఒకరు. బెంగళూర్ లో పుట్టిన ఈ కేరళ కుట్టి..  దక్షిణాది వెండితెరను ఒకప్పుడు ఒక ఊపు ఊఫిన సుందరీ మణి. దక్షిణాది లోని నాలుగు భాషలతో పాటు .. హిందీలో కూడా మెప్పించింది అమ్మడు. ‘ఎవడే అతగాడు’తో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ చిత్రం పరాజయాన్ని చవిచూడటంతో ప్రియమణి తమిళం, మలయాళ భాషలపై దృష్టిపెట్టింది.

2006లో వచ్చిన ‘పెళ్లైన కొత్తలో’ చిత్రంతో ప్రియమణి తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. తెలుగులో తొలి విజయాన్ని సొంతం చేసుకొన్న ఆమె ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘యమదొంగ’లో నటించింది. ఆ తర్వాత ‘హరే రామ్‌’, ‘ద్రోణ’, ‘మిత్రుడు’, ‘ప్రవరాఖ్యుడు’, ‘గోలీమార్‌’, ‘రగడ’, ‘రాజ్‌’, ‘క్షేత్రం’, ‘చారులత’ తదితర చిత్రాల్లో నటించింది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమె ప్రయాణం కొనసాగింది. ప్రకాష్‌రాజ్‌ దర్శకత్వం వహించిన ‘మన ఊరి రామాయణం’ ఆమెలోని అత్యుత్తమ నటనని బయటపెట్టింది. తమిళ చిత్రం ‘పరుత్తివీరన్‌’లో నటనకిగానూ ప్రియమణికి జాతీయ పురస్కారం లభించింది. ప్రియమణి ప్రస్తుతం కన్నడ భాషలో ఎక్కువ సినిమాలు చేస్తోంది. హిందీలో షారుఖ్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’లో ప్రత్యేకగీతం చేసి అదరగొట్టింది. 2017లో బెంగుళూరుకి చెందిన ఈవెంట్స్‌ ఆర్గనైజర్‌ ముస్తఫారాజ్‌ని ప్రేమ వివాహం చేసుకుంది ప్రియమణి. నేడు ప్రియమణి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ సుందరికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే ప్రియమణి

 

Leave a comment

error: Content is protected !!