పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు స్టార్ డమ్ ను తెచ్చిపెట్టిన చిత్రాల్లో ‘సుస్వాగతం’ ఒకటి. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్.బి.చౌదరి నిర్మాణంలో భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1998, జనవరి 1న విడుదలై.. ఘన విజయం సాధించి.. పవన్ కళ్యాణ్ కు అభిమాన గణాన్ని సంపాదించిపెట్టింది. దేవయాని కథానాయికగా నటించగా.. రఘువరన్, ప్రకాశ్ రాజ్, కరణ్, తిరుపతి ప్రకాశ్,బండ్ల గణేశ్ , సుధ, సుధాకర్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయి.. తండ్రి అనురాగ ఆప్యాయతలతో పెరిగిన గణేశ్ అనే యువకుడు.. ఒక అందమైన అమ్మాయిని చాలా సంవత్సరాల నుంచి ప్రేమిస్తూ ఉంటాడు. చదువే లక్ష్యంగా , తండ్రి అదుపాజ్నల్లో పెరిగిన ఆ అమ్మాయి గణేశ్ ప్రేమలోని నిజాయితీని గుర్తించడంలో చాలా ఆలస్యం చేస్తుంది. ఆ క్రమంలో తన ప్రాణ సమానమైన తండ్రిని కోల్పోతాడు గణేశ్. ఆ సంఘటనతో గణేశ్ మీద ఆ అమ్మాయికి ప్రేమ చిగురించినా.. గణేశ్ ఆమె ప్రేమను తిరస్కరించి.. చివరికి తన లక్ష్యసాధనకు సిద్ధపడడమే ఈ సినిమా ఇతివృత్తం. యస్.ఏ.రాజ్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలన్నీ అప్పటి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి. నిజానికి ఈ సినిమా 1997 లో తమిళంలో విడుదలైన ‘లవ్ టుడే’ చిత్రానికి రీమేక్ వెర్షన్. దళపతి విజయ్, సువలక్ష్మి (ఆశ ఆశ ఆశ ఫేమ్) జంటగా నటించిన ఈ సినిమా తమిళనాట ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఇదే సినిమా కన్నడలో గిరి ద్వారకేశ్ హీరోగా ‘మజ్ను’గా రీమేక్ అవ్వగా.. హిందీలో అఫ్తాబ్ శివదాసని, అమీషా పటేల్ జంటగా.. ‘క్యా యహీ ప్యార్ హై’ గానూ రీమేక్ అయి.. ఆయాభాషల్లోనూ ఘన విజయం సాధించింది.