నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన అద్భుతమైన కుటుంబ కథా చిత్రం మూగనోము. ఏవీయం ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి.యోగానంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1969లో విడుదలై అఖండ విజయం సాధించింది. జమున కథానాయికగా నటించిన ఈ సినిమా లో ఇంకా.. యస్వీఆర్, చిత్తూరు నాగయ్య, విజయలలిత, రాజనాల, పద్మనాభం, గీతాంజలి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఆర్.గోవర్ధనం సంగీతం అందించగా,, డి.వి.నరసరాజు సంభాషణలు సమకూర్చారు.

పెద్ద జమీందారు, దివాన్ బహద్దూర్ రాజగోపాలరావు (యస్వీ రంగారావు) జమిలో వ్యవసాయం చేసే రైతు సోమయ్య (నాగయ్య), కూతురు గౌరి (జమున). జమీందారు పుత్రుడు వేణుగోపాల్ (అక్కినేని) ఇంగ్లండులో చదివి ఇండియా వస్తాడు. అనుకోకుండా రైలులో కలిసిన గౌరితో తనొక ఎలక్ట్రిక్ ఉద్యోగినని పరిచయం చేసుకుంటాడు. ఊరికి వచ్చిన తరువాత అతడు జమీందారని తెలిసి దూరం కావాలనుకుంటుంది గౌరి. కాని తను మనసారా ప్రేమించానని ఆమెకు చెప్పి ఒప్పించి, ఊరి గుడిలో తాళికట్టి భార్యగా స్వీకరిస్తాడు. తరువాత తండ్రి చెప్పిన పనిమీద సింగపూర్ వెళ్తాడు. గౌరిని వేణు వివాహం చేసుకున్నాడని తెలుసుకుంటాడు జమీందారు. ఆమె గర్భవతి అని కూడా తెలుస్తుంది. దాంతో ఆమెను, ఆమె తండ్రిని ఊరువిడిచి వెళ్ళమంటాడు. వేణుతో వివాహం సంగతి ఎవరికీ తెలియనీయవద్దని ఆమెచే ప్రమాణం చేయించుకుంటాడు. ఆ ప్రకారం ఊరు వదిలి వెళ్లిన గౌరి ఒక మగపిల్లవాడిని ప్రసవిస్తుంది. అయితే ఆమె తండ్రి, ఆ పిల్లాడిని రామాపురం అనాధాశ్రమంలో వదిలిపెట్టి, బాబు మరణించాడని గౌరికి చెబుతాడు. ఆమె బాధతో కుమిలిపోతుంది. సింగపూరు నుంచి వచ్చిన వేణు గౌరికోసం వెతికి, ఆమె జాడ తెలియక తాగుడు వ్యసనానికి బానిసవుతాడు. పట్నంలో ఒక నర్తకి (విజయలలిత) ఇంట్లో ఆమెను చూసి ఆమె శీలం గురించి నిందిస్తాడు. తరువాత గౌరి రామాపురం స్కూల్లో టీచర్‌గా చేరటం, అక్కడ ఆమె కొడుకు గోపి (బేబీ బ్రహ్మజీ) ఓ అనాధగా పరిచయమై ఆమెకు చేరువకావటం జరుగుతుంది. చివరికి ఆ బాబు తల్లిదండ్రుల్ని ఎలా చేరతాడు అన్నదే మిగతా కథ. నిజానికి ఈసినిమా తమిళంలో సూపర్ హిట్టైన కళత్తూరు కణ్ణమ్మ సినిమాకి రీమేక్ వెర్షన్. సావిత్రి, జెమనీ గణేశన్ జంటగా నటించిన ఈ సినిమాతోనే కమల్ హాసన్ బాలనటుడిగా తమిళ సినీ రంగ ప్రవేశం చేశారు.

Leave a comment

error: Content is protected !!