చూడ్డానికి అమాయకుడిలా కనిపిస్తాడు. కానీ కామెడీ పండించడం లో అసాధ్యుడు. నవ్వు తెప్పించే లాంగ్వేజ్, విచిత్రమైన బాడీ లాంగ్వేజ్ అతడి స్టైల్. చిత్తూరు యాస లో , చిలిపి భాషలో .. అతడు చేసే కొంటె యాక్టింగ్ కు పడిపడి నవ్వుతారు ప్రేక్షకులు. తెలుగు తెరమీద కామెడీగిరి చేసే అతడి పేరు సప్తగిరి. పూర్తి పేరు వెంకట ప్రభు ప్రసాద్. గొప్ప డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి..  కమెడియన్ గా సెటిల్ అయిపోయిన అతగాడు… ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు.

  భాస్కర్ బొమ్మరిల్లు సినిమాతో సహాయ దర్శకుడు అయ్యాడు సప్తగిరి. నిర్మాత దిల్ రాజుకు సహాయ దర్శకుల చేత చిన్న చిన్న వేషాలు వేయించడం ఆనవాయితీ. దాంతో బొమ్మరిల్లు సినిమాలో చిన్న పాత్రలో మొదటి సారిగా తెరపై కనిపించాడు. ఆపై భాస్కర్ దగ్గరే పరుగు సినిమాకు అసోసిసియేట్ డైరెక్టరుగా చేరాడు. బొమ్మరిల్లు సినిమాలో తన హావభావాల్ని పరిశీలించిన భాస్కర్ ఈ సినిమాలో కూడా ఓ పాత్ర రూపకల్పన చేశాడు. మొదట్లో నటించడం ఇష్టం లేకపోయినా అవకాశం పోగొట్టుకోకుండా ఉండటం కోసం నటన, దర్శకత్వం రెండు పనులూ చేశాడు. తర్వాత స్నేహితుడు ఆనంద్ రంగా తీసిన ఓయ్ సినిమాలో నటించాడు. నటనలో అవకాశాలు ఎక్కువగా రాసాగాయి. ఆ తర్వాత కందిరీగ, దరువు, నిప్పు, మంత్ర, గబ్బర్‌ సింగ్‌,  సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత మారుతి ప్రేమకథాచిత్రం  అతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. దీని తర్వాత దృశ్యం, మనం, పవర్, ఎక్స్ ప్రెస్ రాజా, సోగ్గాడే చిన్ని నాయనా, మజ్ను తదితర చిత్రాల్లో నటించాడు. ఒక రోజు విమానంలో వస్తుండగా ఓ తమిళ సినిమా చూసి దాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసుకుని అందులో కథానాయకుడిగా నటిస్తే బాగుంటుందని అనుకుని స్నేహితులను సంప్రదించాడు. అలాగే తను వైద్యం కోసం వెళుతున్న హోమియో వైద్యుడు డాక్టర్ రవి కిరణ్ ఆ సినిమాను నిర్మాతగా ఉండటానికి ముందుకు వచ్చాడు. సప్తగిరి ఎక్స్ ప్రెస్ అనే పేరుతో డిసెంబరు 2016 లో ఈ సినిమా విడుదలైంది. ఇది సప్తగిరికి కథానాయకుడిగా మొదటి సినిమా. ఆ తర్వాత సప్తగిరి ఎల్ ఎల్ బీ, వజ్రకవచధర గోవింద లాంటి సినిమాల్లో కూడా హీరోగా నటించి.. మరో వైపు కమెడియన్ గానూ నటిస్తోన్న సప్తగిరి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆ మగజాతి ఆణిముత్యానికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే సప్తగిరి.

Leave a comment

error: Content is protected !!