అగ్ర దర్శకులు ఆదుర్తి సుబ్బారావు బాగా బిజీగా వుంటూ కూడా అందరూ నూతన నటీనటులతో చిత్ర నిర్మాణం చేయాలనే సంకల్పానికి అక్కినేని లాంటి పెద్దల ప్రోత్సాహంతో బాలు మూవీస్ బ్యానర్‌పై ‘తేనెమనసులు’ చిత్ర నిర్మాణం ప్రారంభించారు. హీరో కృష్ణ, రాంమోహన్, సంధ్యారాణి, సుక న్య, పుష్పవల్లి, వెంకటేశ్వరరావు తదితర నూతన నటీనటులతో మొదట బ్లాక్ అండ్ వైట్‌లో చిత్ర నిర్మాణం జరిపి మళ్లీ కాదనుకొని భారీగా నిర్మించ తలచి పూర్తిస్థాయి ఈస్ట్‌మన్ కలర్‌లో చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో సాంఘిక తొలి రంగుల చిత్రం ఇది! 1965 మార్చి 31వ తేదీన విడుదలైన ‘తేనెమనసులు’ అఖండ విజయం సాధించింది. ఈ సినిమా విడుదలై సరిగ్గా నేటికి 55 ఏళ్ళు పూర్తయ్యాయి.
ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పరిచయం కావటం కొత్తవారితో చిత్ర నిర్మాణానికి బలాన్నిచ్చింది. ముందుగా అందరికీ నటనలో తర్ఫీదు ఇచ్చి మంచి నటనను ఆదుర్తి రాబట్టుకున్నారు. కె.వి.మహదేవన్ సంగీత దర్శకత్వంలో ప్రతి పాటా ఆత్రేయ సాహిత్యంలో సూపర్‌హిట్ అయ్యాయి. ఆత్రేయ సాహిత్యం ఆనాటి యువతను ఉర్రూతలూగించింది. ఈ సాహిత్యం ఏ కాలానికైనా వర్తిస్తుంది. ఇన్ని సలక్షణాలు ఉన్న ఈ చిత్రం ఎవరికైనా నచ్చుతుంది. ఈ చిత్రంలో ఘంటసాల పాటలు అగ్రహీరోలకు ఉండవలసిన స్థాయిలో వారికి సూటయ్యేటట్లుగా ఉంటాయి. ఈ పాటలు చిత్రానికి హైలెట్ అయ్యాయి. కొత్తవారుగా పరిచయమైన కృష్ణ పాత్ర పోషణ, తీరు తమాషాగా వుంటుంది. రాంమోహన్ అయితే బాంబే నటుడు దేవానంద్ నటనతో పోల్చేవారు. సుకన్య కృష్ణకుమారి పోలికలతో బాగుండి స్పష్టమైన డైలాగ్ డెలివరీ ఆమె ప్రత్యేకత. రాంమోహన్ నటన మెచ్చుకున్న ఆదుర్తి వృద్ధిలోకి రాగలడని అంచనా వేస్తే, కృష్ణమాత్రం సూపర్‌స్టార్‌గా ఎదగడం విచిత్రం. సో.. అలాంటి తేనెలూరే ‘తేనెమనసులు’ చిత్రాన్ని ఎప్పుడు ఆస్వాదించినా మధురంగా ఉంటుంది