సాయితేజ్ హీరోగా దేవ్‌ కట్టా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘రిప‌బ్లిక్‌’. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జె. భగవాన్, జె. పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ బ్యాక్‌డ్రాప్‌గా రూపొందిన ఈ సినిమా అక్టోబ‌ర్ 1న విడుద‌లై సూప‌ర్‌హిట్ టాక్‌తో మంచి క‌లెక్ష‌న్స్ సాధిస్తోంది. అలాగే ఈ సినిమాకు సినీ, రాజ‌కీయ వ‌ర్గాల‌నుండి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. తాజాగా రిప‌బ్లిక్  సినిమాను హైద‌రాబాద్‌లోని AMB మాల్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, సింగ‌ర్ స్మిత వీక్షించారు. ఈ సంద‌ర్భంగా ఏర్ప‌టు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో…

దేవ్‌ కట్టా మాట్లాడుతూ.. ‘సినిమా ఎమోషన్ అనేది బరువుగా ఉన్నప్పుడే దానికి మనం కనెక్ట్ అవగలం. ఈ సినిమాను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. విమర్శకులు సైతం సినిమా మీద ప్రశంసలు కురిపించారు. ప్రస్థానం లాంటి సినిమా ఎప్పుడు చేస్తారు అని అందరూ అడిగేవారు. ఇప్పుడు మీ కళ్ల ముందుంది. నా కళ్లతో అది కనిపిస్తోంది. ప్రస్థానం కూడా మౌత్ టాక్‌తో కల్ట్‌గా మారింది. సినిమా విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘ప్రస్థానం సినిమాను నేను యూఎస్ పర్యటనలో ఉన్నప్పుడు చూశాను. వాస్తవ పరిస్థితులకు తగ్గట్టుగా సినిమాలు తీస్తాడు దేవ్‌ కట్టా. చాలా సినిమాలు ఎండ్ కార్డ్ పడ్డాక ఏదో ఒక కంక్లూజన్‌తో ప్రేక్షకుడు బయటకు వస్తాడు. కానీ మేం మాత్రం వంద ప్రశ్నలు, ఆలోచనలతో బయటకు వచ్చాం. జరిగిన దానికంటే చేయాల్సింది ఎంతో ఉంది. ప్రజాస్వామ్యం మెచ్యూర్ అవ్వాలంటే చేస్తున్న పనుల్లోని లోపాలను సరిదిద్దుకోవాలి. మంచి పాలన అందించేందుకు సరైన నిర్ణయాలను తీసుకోవాలి ఇలాంటివి ఇంకా ఎన్నో… ఈ చిత్రంలో ఒక  ప్రాంతంలోని సమస్యను మాత్రమే చూపించి ప్రశ్నలను మాత్రం అన్ని వ్యవస్థలపై వేసినట్టుగా దేవా కట్టా తెర‌కెక్కించారు. సినిమా అనేది నిర్మాతలకు నష్టమో లాభమో అనే కోణంలో నేను చూడలేదు. కానీ ప్రజలకు మాత్రం ఈ సినిమా కచ్చితంగా ఉపయోగపడుతుంది. కొద్ది మందిలోనైనా మార్పు తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను. దేవ్‌కట్టా ఓ మంచి సినిమాను తీశారు. దీన్ని యువత చూడాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య దేశం మనకు ఏం ఇచ్చిందనే కంటే.. మనం ఏం చేశామని ఆలోచనను రేకెత్తిస్తారు. మన దేశానికి, మన ప్రాంతానికి ఏదైనా ఒక మంచి పని చేయాలి. సినిమాను  హీరో హీరోయిన్లు బాగా చేశారు అని చూడటం కంటే.. ఇంకా ఎక్కువ స్థాయిలో సినిమాను చూడాలి. జగపతి బాబు గారు  అద్భుతంగా నటించారు’ అని అన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. ‘సినిమాకు రావడం ఇదే ఫస్ట్ టైం. ఈ సినిమా చూసిన తరువాత గుండె బరువెక్కింది. నాకు ఓ చరిత్ర, ఘటన గుర్తుకు వస్తుంది. బ్రిటీష్ పరిపాలన‌కు వ్యతిరేకంగా పోరాడిన గాంధీజీని.. ఓ గాడ్సే రూపంలో చంపేస్తే.. అలానే ఓ అధికారి ప్రజల బాధలను తొలగిస్తే.. వారే మళ్లీ తిరిగి అధికారిని చంపడం వంటి ఘటనలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ప్రతీ ఒక్కరూ ఈ సినిమా చూడాలి. రాజకీయాల్లో మార్పు రావాలి. ప్రజల్లోనూ మార్పులు రావాలి. ప్రతీ ఒక్కరిలో మార్పులు వస్తే మంచి ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకోగలం. ప్రజలు, మాలాంటి పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా సినిమాను చూసి మార్పును కోరుకోవాలి’అని అన్నారు.

Leave a comment

error: Content is protected !!