దర్శకరత్న దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన సినిమాల్లో అద్భుతమైన ప్రశంసలందుకున్న సినిమా ‘తూర్పు పడమర’. 1976లో విడుదలైన ఈ సినిమా అఖండ విజయం సాధించింది. నరసింహరాజు హీరోగా, శ్రీవిద్య , మాధవి హీరోయిన్స్ గా కైకాల సత్యనారాయణ , సి.నారాయణ రెడ్డి ముఖ్యపాత్రలో కనిపించిన ఈ సినిమా ముఖ్యంగా మానవ సంబంధాల్ని, భావోద్వేగాల్ని ఆవిష్కరించిన సినిమా. రమేష్ నాయుడు సంగీత సారధ్యంలోని పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ . ముఖ్యంగా తూర్పు పడమర ఎదురెదురు, శివరంజని నవరాగిణి లాంటి పాటలు ఇప్పటికీ సంగీత ప్రియుల్ని అలరిస్తూనే ఉన్నాయి.
హీరో నరసింహారాజు తనకన్నా వయసులో పెద్దదైన శ్రీవిద్యను ప్రేమిస్తాడు. అయితే శ్రీవిద్య కూతురు మాధవి మాత్రం నరసింహరాజు తండ్రి కైకాల సత్యనారాయణ ట్రాప్ లో పడుతుంది. అప్పుడు ఆ పాత్రల మధ్య మొదలైన సంఘర్షణ, దాని వల్ల కలిగే సమస్యలు ఈ సినిమా కథను అనూహ్యమైన మలుపు తిప్పుతాయి. నిజానికి ఈ సినిమా తెలుగు సినిమాల్లో ఒక ప్రయోగం లాంటిది. కె.బాలచందర్ తమిళ్ సూపర్ హిట్ మూవీ అపూర్వరాగంగళ్ సినిమాకిది రీమేక్ వెర్షన్. తమిళంలో కమల్ హాసన్, రజనీకాంత్, జయసుధ, శ్రీవిద్య ముఖ్యపాత్రలు పోషించారు. అక్కడ కూడా ఈ సినిమా ఎన్నో అవార్డులు దక్కించుకుంది.