సన్నగా రివటలా ఉంటాడు. అయితేనేం  నవ్వించడంలో కింగ్. నెల్లూరు యాసలో డైలాగులు గడగడా చెబుతూ … విచిత్రమైన బాడీ లాంగ్వేజ్ తో  మెలికలు తిరిగిపోతూ.. కడుపుబ్బ నవ్విస్తాడు. అన్ని రకాల పాత్రలకి ఆయన పెట్టింది పేరు. అన్ని రకాల జోనర్స్ లోనూ ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు. ఆయన పేరు తిక్కవరపు రమణారెడ్డి. చూడగానే నవ్వుపుట్టించే విచిత్రమైన పెర్సనాలిటీ ఆయనది. అదే ఆయనకి ప్రత్యేక ఆకర్షణ.

నెల్లూరు జిల్లా జగదేవిపేటలో జన్మించారు రమణారెడ్డి. ప్రాథమిక విద్యను అభ్యసించే రోజుల నుంచే ఆయన నాటకాలు ప్రారంభించారు. నెల్లూరు వీఆర్‌ కాలేజీలో ఎఫ్‌ఏ చదివేటప్పుడు మన మససు కవి ఆచార్య ఆత్రేయ, ఫన్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌లతో కలిసి ఊరూరా నాటక ప్రదర్శనలు ఇస్తుండేవారు. మంచి మెజీషియన్‌గా ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ ఆ తరువాతనే సినిమా పరిశ్రమలో అడుగు పెట్టారు రమణారెడ్డి. లవకుశ చిత్ర నిర్మాత నెల్లూరు వాసి అయిన శంకర్‌రెడ్డి ప్రోత్సాహంతో ఆయన మద్రాసుకు వెళ్లేందుకు మార్గం సులువైయింది. మొదటి నుంచి మ్యాజిక్‌ చేయటం సరదా అయినా దానిని అతి కొద్ది కాలంలోనే అభ్యసించారు. తీరిక దొరికినప్పుడల్లా మ్యాజిక్‌ విద్యలో మరింత మెలకువలు నేర్చుకుంటూ అక్కాచెల్లెలు సినిమాలో ఒక పాత్రలో కూడా నటించి ప్రముఖ ఇంద్రజాలికుడైన పీసీ సర్కార్‌ దగ్గర మరి కొంత విద్య అభ్యసించారు. ఆ తరువాత సినిమా సభల్లో కూడా ఈ విద్యను ప్రదర్శించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్చించేవారు.

రమణారెడ్డి  తొలిచిత్రం మానవతి. ఆ తర్వాత  సుమంగళి, దేవత చిత్రాలతోపాటు బంగారు పాప, మిస్సమ్మ చిత్రాలలో ముఖ్య భూమికలు పోషించారు. కేవీ రెడ్డి పౌరాణిక చిత్రం మాయాబజారులో రమణారెడ్డి పోషించిన చిన్మయ పాత్ర గుర్తిండిపోయేదిగా మలచబడింది. గుండమ్మ కథ చిత్రంలో సూర్యకాంతం అన్న గరటయ్యగా ఆయన పోషించిన పాత్ర గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందింది. కులగోత్రాలు చిత్రంలో పేకాట ప్రియుడుగా ప్రేక్షకులను మెప్పించారు. అయ్యయ్యో జేబులో డబ్బులు పోయనే అనే పాటలో నటన అతి సహజంగా అభిమానాన్ని పొందింది. అలాగే మిస్సమ్మలో డేవిడ్‌ పాత్ర కూడా అంతే సహజంగా నిలిచింది. ఒక సినిమాలో  నారదుడి వేషం వేసి ఎముకలు కూడా కనిపించకుండా జుబ్బా తొడిగిన  ఘనత ఆయనకే దక్కింది. బంగారు పాపలో కూడా ముక్కు, గొంతుతో మాట్లాడినట్లు అత్యంత వెరైటీగా నటించారు. భానుమతి రామకృష్ణతో అంతస్తులులో నటిస్తూ, రేలంగితో దులపర బుల్లోడా.. పాటలో నటించటం అప్పట్లో సంచలనంగా మారింది. శంకర్రెడ్డి లవకుశలో సూర్యకాంతం వీరికి అర్ధాంగిగా నటించింది. ఇందులో వీరి హాస్యం ప్రేక్షకులను గిలిగింతులు పెడుతుంది. ఇంకా ఎన్నో చిత్రాల్లో ఎన్నో జిమ్మిక్స్‌, మ్యాజిక్స్‌ చేసి ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం పొందారు. నేడు రమణారెడ్డి జయంతి. ఈ సందర్భంగా ఆయనకి ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

 

 

 

 

Leave a comment

error: Content is protected !!