అందమైన ముఖం.. ఆకర్షించే కళ్ళు.. గంభీరమైన వాచకం.. కంచులాంటి కంఠం. ఎలాంటి పాత్రనైనా పోషించగలిగిన ప్రతిభ.. ఏ భాషలోనైనా అభినయించగలిగిన సామర్ధ్యం ఆయన ప్రత్యేకతలు. పేరు మమ్ముట్టి. మాలీవుడ్ ప్రేక్షకుల అభిమాన నాయకుడు. అసమాన నటనా సమర్ధుడు. నాలుగు దశాబ్దాల సినిమా కెరీర్లో 400 సినిమాలకు పైగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. మాతృభాష మలయాళంలో ఎక్కువగా నటించిన మమ్ముట్టి అడపాదడపా తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల ప్రేక్షకులను కూడా పలకరించారు. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్వాతి కిరణం’ అనే సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన మమ్ముట్టి ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల ఆదరణను పొందగలిగారు.

మమ్ముట్టి కుటుంబానికి నటన నేపథ్యం లేదు. కానీ, నటనపై ఆసక్తి ఈయనకు పుష్కలంగా ఉంది. సినిమాల్లో నటించాలన్న లోతైన కోరిక ఎలా వచ్చిందో మమ్ముట్టికి కూడా తెలియదట. సినిమాల్లో తనని తాను ప్రూవ్‌ చేసుకోవాలని ఎప్పుడూ అనుకునే వారట మమ్ముట్టి. ఈ రోజు పరిశ్రమలో ఇంతటి స్థాయిని చేరుకుంటారని కూడా ఈయన అనుకోలేదట. సమాజంలో మార్పులు తీసుకొచ్చే శక్తి నటుడికి ఉందన్నది మమ్ముట్టి విశ్వాసం.

ఈ విలక్షణ నటుడి ఖాతాలో మూడు జాతీయ సినిమా అవార్డులు, ఏడు కేరళ రాష్ట్ర సినిమా అవార్డులు, 13 ఫిలింఫేర్‌ అవార్డులు, 11 కేరళ సినిమా విమర్శకుల అవార్డులు, అలాగే 5 ఏషియా నెట్‌ సినిమా అవార్డులు ఉన్నాయి. 1998లో భారత సినిమా పరిశ్రమకు ఎంతో విలువైన సేవ అందించినందుకుగానూ భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఈయనని సత్కరించింది. గౌరవ డాక్టరేట్‌ డిగ్రీలు కాలికట్‌ విశ్వవిద్యాలయం అలాగే కేరళ విశ్వవిద్యాలయం నుంచి పొందారు.

Leave a comment

error: Content is protected !!