బయోపిక్‌ అంటే భజన అనుకునే స్థాయికి కొన్ని సినిమాలొచ్చాయి. 800 మూవీ కూడా అదే కోవలోకి చెందుతుందేమో అనుకున్నవారున్నారు. కానీ సినిమా చూసాక కానీ అర్ధం కాదు.. ఈ బయోపిక్ గుండెను బరువెక్కించే ఎమోషనల్ జర్నీ అని. ముత్తయ్య మురళీధరన్‌ జీవితంలో క్రికెట్‌ ఆట ఒక్కటే కాదు.. ఎన్నో ఆటుపోట్లున్నాయి. ఎదిగే క్రమంలో వెన్నుపోట్లూ ఉన్నాయి. సొంత దేశంలో పరాయి వాడివి అని వెక్కిరించిన నోళ్లు.. క్రికెట్‌లోకి వచ్చాక తనను మోసగాడిలా చూసిన కళ్లు.. తాను తప్పు చేయలేదని చెప్పినా వినిపించుకోని చెవులు.. ఇలా చుట్టూ కష్టాల సుడులు.. మురళీధరన్‌ జీవితంలో ముప్పేట చేసిన దాడిని కళ్లకు కట్టింది 800 మూవీ.

500 వికెట్లు తీసినా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చినపుడు మురళీధరన్‌ మానసిక స్థితిని తెరపరచడంలో దర్శకుడు శ్రీపతి.. అభినయించడంలో నటుడు మధుర్‌ మిట్టల్‌ సక్సెస్‌ అయ్యారు.

వ్యక్తిగత జీవితంలో వెక్కిరించే పరిస్థితులనుంచి కెరీర్‌లో 800 వికెట్లు తీసి రికార్డ్‌ సృష్టించిన చరిత్ర వరకు.. మధ్యలో LTTE, శ్రీలంక తమిళులు, సింహళులు.. వీటన్నింటి మధ్యలో మురళీధరన్ లోని హైలీ ఎమోషన్‌ కు అద్భుతమైన చిత్రీకరణ ఈ 800 మూవీ.

నేను తప్పు చేయలేదని నిరూపించుకోవడంలోనే నా జీవితం అయిపోయిందని మురళీధరన్‌ చెప్పే డైలాగ్.. ప్రతీ ప్రేక్షకుడి గుండెని మెలిపెడుతుంది.

నటీనటుల పనితీరు బావుంది అనడం కంటే ఎవరి పాత్రలో వారు జీవించారని చెప్పొచ్చు.

టెక్నిషియన్స్‌ విషయానికొస్తే.. దర్శకుడు శ్రీపతి స్లో నేరేషన్ కమర్షియల్ సినిమాలకు అలువాటు పడిన వాళ్లకు కాస్త ఇబ్బందిపెట్టినా.. ఓవరాల్‌ గా ప్రేక్షకులను సినిమాలో లీనం చేస్తుంది. శ్రీపతి స్క్రీన్‌ప్లే అద్భుతం.

టెస్ట్ క్రికెట్‌లో రికార్డ్ సృష్టించిన ఓ ఆటగాడి ఆటుపోట్ల జీవితానికి తెరరూపం 800.

మూవీ వాల్యూమ్‌ రేటింగ్ : 3.5/5

Leave a comment

error: Content is protected !!