కామెడీ ఆయన ప్రాణం.. సెటైర్ ఆయన ఊపిరి. ఎలాంటి సినిమా తీసినా.. అందులో తనదైన ముద్ర ఉండాలి అనే తపించే ఆ దక్షిణాది దర్శకుడి పేరు మౌళి. తిరువిడైమరుదూర్ సాంబమూర్తి గణపాడిగల్ బాలకృష్ణ శాస్త్రిగళ్ మౌళి ఆయన అసలు పేరు. తండ్రి తమిళనాట ప్రముఖ హరికథా భాగవతార్. చిన్నప్పటి నుంచి మౌళికి నాటకాలమీద మక్కువ ఎక్కువ. స్కూల్లో చదువుకొనే రోజుల నుంచి మౌళి నాటకాలు స్వయంగా రాసుకొని ప్రదర్శించేవారు. ఆ ప్రతిభే ఆయన్ను సినిమాల వరకూ నడిపించింది. 1969 లో ఆయన రాసిన ఫ్లైట్ నెంబర్ 172 నాటకాన్ని ఆయనే స్వయంగా నటించి ప్రదర్శించారు. ఆయనకు అది ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది.
1973లో సూర్యకాంతి అనే సినిమాతో తమిళనాట దర్శకుడిగా అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే మంచి విజయం సొంతం చేసుకున్న మౌళి .. ఆ తర్వాత మరిన్ని చిత్రాలతో దర్శకుడిగా వెలిగారు. 1982 లో చిరంజీవి నటించిన పట్నం వచ్చిన పతివ్రతలు చిత్రంతో తెలుగులో దర్శకుడిగా ప్రవేశించారు. ఆ పై ఎన్నో చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అశ్వని, ఆదర్శం, పైలా పచ్చీస్ , జీవనగంగ లాంటి సినిమాలతో మౌళి ఫేమస్ అయ్యారు. ఇక ఆయన నటుడిగానూ ఎన్నో సినిమాల్లో హాస్య పాత్రలు పోషించారు. అలాగే.. ఆయన దర్శకత్వం వహించిన బ్రహ్మచారి, నవ్వండి లవ్వండి సినిమాలు తెలుగులో మంచి విజయం సాధించాయి. 2003 లో వచ్చిన నలదమయంతి సినిమా మౌళి దర్శకత్వం వహించిన ఆఖరి సినిమా. నేడు మౌళి పుట్టినరోజు. ఈ సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.