ఆయన బాణీ కడితే అది శ్రావ్యమైన గీతమైపోతుంది. ఓ రాగం ఎత్తుకుంటే.. అది ఒక మంచి పాటై పల్లవిస్తుంది. ఒక స్వరం ఊహించుకొంటే.. అది సుస్వరమై పరిమళిస్తుంది. ఆ సంగీత దర్శకుడి పేరు మాధవపెద్ది సురేష్. ఆయన స్వరాలు కూర్చిన సినిమాల సంఖ్య తక్కువైనప్పటికీ.. మంచి మంచి పాటలు కూర్చారు. మెలోడియస్ ట్యూన్స్ ఇచ్చారు. ఆ పాటలన్నీ ఇప్పటికీ మనసుకు ఎంతో మనోహరంగా అనిపిస్తాయి.
తెనాలిలో జన్మించిన సురేష్ .. చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి పెంచుకున్నారు. విజయవాడలో ఉండగా.. శ్రీరామనవమి ఉత్సవాల్లో హార్మోనియం వాయించేవారు. ఆయన సోదరుడు రమేష్ నేపథ్య గాయకుడిగా కెరీర్ ప్రారంభించారు. టి. చలపతిరావు సంగీత దర్శకత్వం వహించిన పరివర్తన సినిమాలో సురేష్ మొదటిసారిగా అకార్డియన్ అనే పరికరాన్ని వాయించారు. ఆ తర్వాత కీబోర్డు ప్లేయరుగా పెండ్యాల, సాలూరి రాజేశ్వరరావు, ఎం. ఎస్. విశ్వనాథన్, కె. వి. మహదేవన్, రమేష్ నాయుడు, జె. వి. రాఘవులు, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, బప్పీలహరి, హంసలేఖ మొదలైన సంగీతదర్శకుల దగ్గర సుమారు 1000 చిత్రాలకు పనిచేశారు. 1979 నుంచి 1985 దాకా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం బృందంతో పాటు కీబోర్డు ప్లేయరుగా ప్రదర్శనలిచ్చారు.
జంధ్యాల ‘హై హై నాయకా’ సినిమాతో సంగీత దర్శకుడిగా మారారు మాధవపెద్ది సురేష్. బృందావనం సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. శతదినోత్సవం కూడా జరుపుకుంది. మాతో పెట్టుకోకు, శ్రీకృష్ణార్జున విజయం, భైరవద్వీపం లాంటి సినిమాలకు సురేష్ అద్భుతమైన సంగీతం అందించారు. ఎర్లియర్ గా ఆయన సంగీతం అందించిన సినిమా మిక్చర్ పొట్లాం. నేడు మాధవపెద్ది సురేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.