సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ బిగినింగ్ లో నటించిన యాక్షన్ చిత్రాల్లో  అరుదైన సినిమా సర్కార్ ఎక్స్ ప్రెస్ . గౌరీ ఆర్ట్ ఫిల్మ్స్ సమర్పణలో యస్. భావనారాయణ నిర్మాణ సారధ్యంలో మలయాళ దర్శకుడు యం. కృష్ణన్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో తెలుగు ప్రేక్షకుల్ని అబ్బుర పరిచింది. తెలుగులో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ను అంతగా చూసి ఉండని ప్రేక్షకులు ఈ సినిమాకి భలేగా థ్రిల్ అయ్యారు. విజయనిర్మల  కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఇంకా.. జయలలిత, రాజబాబు, సి.యస్.ఆర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సత్యం మాస్టారు సంగీతం అందించగా.. సినారె పాటలు, పాలగుమ్మి పద్మరాజు సంభాషణలు రాశారు.

సర్కార్ ఎక్స్ ప్రెస్ లో జరిగిన ఒక మర్డర్ ను ఇన్వెస్టిగేట్ చేయడానికి సి.బి.ఐ ఆఫీసరైన హీరో రంగంలోకి దిగుతాడు. ఆ హత్యను కళ్ళారా చూసిన ఒకేఒక వ్యక్తిని ఆ ఆఫీసర్ ఇంటరాగేట్ చేస్తాడు. అతడే ఆ మర్డర్ కు కారణమనే సందేహాలు రేకెత్తిస్తాడు. ఇంతకీ ఆ ఆఫీసర్ మర్డర్ ను ఎలా సాల్వ్ చేస్తాడు అన్నదే మిగతా కథ. నిజానికి ఈ సినిమా కొచిన్ ఎక్స్ ప్రెస్ అనే మలయాళ సినిమాకి రీమేక్ వెర్షన్. ప్రేమ్ నజీర్ హీరోగా నటించిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్టైంది. ఆ తర్వాత ఇదే సినిమాను తమిళంలో జై శంకర్ తో నీలగిరి ఎక్స్ ప్రెస్ గా తీశారు. అలాగే. కన్నడలో బెంగళూర్ మెయిల్ గా రీమేక్ చేశారు. అలాగే హిందీలోనూ ది ట్రెయిన్ గా రీమేక్ చేశారు.

Leave a comment

error: Content is protected !!