కొందరు నటులు స్టార్స్ గా మారలేరు. కొందరు స్టార్స్ నటులు గానే ఎప్పటికీ ఉండిపోరు.  సహజమైన నటనతో .. ప్రేక్షకుల హృదయాలను దోచుకోగలిగేవాడు ఎప్పటికీ స్టారే. అలాంటి నేచురల్ స్టార్ నాని. నిర్మాతల పాలిట  మినిమమ్ గ్యారెంటీ హీరో గానూ, డిస్ట్రి బ్యూటర్స్ పాలిట కొంగుబంగారం గానూ నేటికీ నిలిచిన స్టార్ అతడు. వైవిధ్యమైన పాత్రలు, విభిన్న తరహాకథలు.. ఎంపిక చేసుకోవడంలో అతడు మాస్టర్. ఆ సుగుణం వల్లనే అతడు జయాపజయాలతో పనిలేకుండా.. టాలీవుడ్ జనాన్ని ఎప్పటికప్పుడు  తన సినిమాలతో థియేటర్స్ కు రప్పించగలుగుతున్నాడు. ‘అష్టాచెమ్మ’తో టాలీవుడ్లో హీరోగా తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన నానీ.. ఎన్నో విజయాలు .. కొన్నే పరాజయాలతో హీరోగా వెలిగి..   ఇప్పుడు ‘వీ’ చిత్రంతో మరోసారి తనలోని అసలైన నటుడ్ని వెలికితీయబోతున్నాడు.

నానీ పుట్టింది కృష్ణా జిల్లా చల్లపల్లిలో అయినా, తల్లిదండ్రులు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. నాని బాల్యమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. చిన్నప్పట్నుంచి సినిమాలపై ప్రేమ పెంచుకొన్న నాని… కె.రాఘవేంద్రరావు, శ్రీనువైట్ల, బాపు తదితర దర్శకుల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆ తర్వాత కొన్నాళ్లు రేడియో జాకీగా పనిచేశారు. మోహన కృష్ణ ఇంద్రగంటి దృష్టిలో పడి ‘అష్టాచమ్మా’లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకొన్నాడు. అప్పట్నుంచి అతడు  ప్రయాణం దిగ్విజయంగా సాగుతోంది. మధ్యలో యేడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ బాక్సాఫీసుని కళకళాడించాడు నాని. సహజమైన నటనతో పాత్రల్లో ఒదిగిపోవడం నాని ప్రత్యేకత. అదే ఆయన్ని నాచురల్‌ స్టార్‌ని చేసింది. ప్రేక్షకుల్లో ఉన్న గుర్తింపు, వాక్చాతుర్యం వల్ల బిగ్‌ బాస్‌2ని హోస్ట్‌ చేసే అవకాశం కూడా వరించింది. ‘డి ఫర్‌ దోపిడి’, ‘అ!’ చిత్రాలతో నిర్మాతగా కూడా కొత్త ప్రయత్నాలు చేశాడు.  ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఈ రోజు నాని పుట్టినరోజు.  ఈ సందర్భంగా నానీకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే నానీ…

 

Leave a comment

error: Content is protected !!