Shopping Cart 0 items - $0.00 0

నూటికో కోటికో ఒక్కడు

ఆయన కొలిస్తే రాముడు. పిలిస్తే కృష్ణుడు.  ఆరాధిస్తే దేవుడు . అబ్బుర పరిచే అభినయం, అచ్చెరువొందించే ఆంగికం,  ముచ్చట గొలిపేవాచకం ఆయన ఆభరణాలు . ఆ మహా నటుడి పేరు నందమూరి తారకరామారావు. తరాలెన్ని మారినా.. ఆయన ఎప్పటికీ తెలుగు వారి గుండెల్లో తారకరాముడే. ఆయన నటించిన సినిమాలు.. ధరించిన పాత్రలు .. చేసిన ప్రయోగాలు ఇప్పటి తరం నటీనటులకు, దర్శకులకు పాఠ్యాంశాలు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయారు యన్టీఆర్. తన సుదీర్ఘ సినిమా జీవితంలో 13 చారిత్రకాలు, 55 జానపద,  186 సాంఘిక,  44 పౌరాణిక చిత్రాల్లో నటించి మెప్పించారు.

1923, మే 28న కృష్ణాజిల్లా నిమ్మకూరులో జన్మించారు యన్టీఆర్. విజయవాడలో పాఠశాల విద్యను అభ్యసించిన ఆయన.. ఆ తర్వాత అక్కడే కాలేజ్ లో చేరారు. అక్కడ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధ్యాపకుడు.  ఆ వయసునుంచే  నాటకాల మీద ఎంతో మక్కువచూపించిన యన్టీఆర్ కు.. ఒక నాటకంలో ఆడవేషం వేయాల్సి వచ్చింది. అయితే తన మీసాలు తీయడానికి ఎంత మాత్రం ఒప్పుకోని ఆయన మీసాలతోనే నటించి .. మీసాల నాగమ్మ అయ్యారు. ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కె.వి.ఎస్.శర్మ తదితరులతో ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. తర్వాతి కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది.

1949 లో ‘మనదేశం’ చిత్రంతో తెలుగు తెరమీద నటుడిగా అరంగేట్రం చేసిన యన్టీఆర్.. పాతాళ భైరవి చిత్రంతో స్టార్ డమ్ అందుకున్నారు. ఆ తర్వాత ‘మల్లీశ్వరి, మాయాబజార్’ చిత్రాలతో ఆయన పేరు తెలుగు నాట మారుమోగిపోయింది. ఇక ‘లవకుశ’ చిత్రంతో రాముడిగానూ, ‘సీతారామకళ్యాణం’ సినిమా లో రావణాసురుడిగానూ జీవించి .. ఆ పాత్రలకు ఆయనను  కాకుండా వేరెవరినీ తెలుగు వారు ఊహించుకోలేని స్థాయికి యన్టీఆర్ ఎదిగారు. తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు యన్టీఆర్ . తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు.

యన్టీఆర్  1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసారు. కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తరువాత మూడు దఫాలుగా 7 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచారు యన్టీఆర్. ఇలాంటి ఓ కథానాయకుడు, మహానాయకుడు నూటికో కోటికో ఉంటారు. అన్నగారిగా అఖిలాంధ్ర ప్రేక్షకుల  గుండెల్లో నిలిచిపోయిన ఆయన వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహానటుడికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్ .

Leave a comment

error: Content is protected !!