మహానటి లోని జెమినీ గణేశన్ గా అదరగొట్టి.. తెలుగు వారి అభిమానాన్ని చూరగొన్న మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్.  తండ్రి మమ్ముట్టి నట వారసత్వం పుణికి పుచ్చుకొని .. ఆయనలాగానే  దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ నటించి పేరు తెచ్చుకోవాలన్నది అతడి ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే దుల్కర్ తాజాగా ‘కణ్ణుమ్ కణ్ణుమ్ కొల్లైయడిత్తాల్’ అనే తమిళ చిత్రంలో నటించాడు.  దేసింగ్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’ గా ఈ రోజే  విడుదలయింది.  ఈ సందర్భంగా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో దుల్కర్ ఇటీవల హైద్రాబాద్ లో విలేఖరులతో ముచ్చటించాడు…..

8 ఏళ్ళ  సినీ ప్రస్థానంలో మీరు మొత్తం 25 సినిమాల్లో నటించారు. ఈ జెర్నీ మీకు ఎలా అనిపిస్తోంది?

నటుడిగా ఏ భాషలోకి అడుగుపెట్టినా..  ప్రేక్షకులు నన్ను తనవాడిగానే భావిస్తున్నారు. ఇక సినిమా సంఖ్య అంటారా.. మలయాళంలో నా సమకాలికులతో పోల్చుకుంటే.. చాలా తక్కువ చేస్తున్నాను. నేను కూడా సినిమాల సంఖ్య పెంచుకోవాలి.

మహానటి తర్వాత మీరు మళ్లీ తెలుగులో నటించకపోవడానికి కారణమేంటి?

ఏ భాషలోకెళ్లినా నాకు ఇదే ప్రశ్న ఎదురవుతోంది. మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని నేను సినిమా చేయాలనుకోను. నేను ఎంచుకొన్న కథ ఏ ఏ వర్గాల వారికి చేరువవుతుందో వారి వద్దకే తీసుకెళ్లాలనుకుంటాను. దర్శకుడు దేసింగ్ పెరియసామి ఈ సినిమా కథ చెప్పినప్పుడు దీన్ని తమిళ, మలయాళంలో విడుదల చేస్తే బాగుంటుందనిపించింది.

ఈ చిత్ర కథేంటి? ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?

ఇందులో నేను సరదాగా లైఫ్ ను ఎంజయ్ చేయాలనుకొనే ఈతరం కుర్రోడి పాత్ర ను పోషించాను. వివిధ రకాల జోనర్స్ తో మిక్సైన థ్రిల్లింగ్ స్టోరీ ఇది. కథలో మలుపులు ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. బ్రిలియంట్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఇందులో ప్రతినాయకుడిగా నటించారు. ఆయన పాత్ర అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

హీరోయిన్ రీతూ వర్మ మీకు తెలుగు భాష విషయంలో ఏమైనా సహాయం చేసిందా?

ఆమె నాకు తెలుగు నేర్పించడం కాదు.. నేనే ఆమెకు మలయాళం నేర్పించాను. నాకు కొత్త భాషలు నేర్చుకోవడం చాలా ఇంట్రెస్ట్. ఒక భాషగురించి తెలియకుండా..అందులో సినిమా చేయడానికి అసలు సాహసించను. ‘మహానటి’ చిత్రం  సంభాషణల్లోని  ప్రతీ పదానికి అర్ధం తెలుసుకొని మరీ నా పాత్రకు డబ్బింగ్ చెప్పా.  ఇప్పుడు ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రానికి కూడా నేనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాను.

మీ తండ్రి మమ్ముట్టి మలయాళంలో చాలా చారిత్రక చిత్రాలు చేశారు. ఇటీవల కూడా మామాంగం తో వచ్చారు. మీకు కూడా అలాంటి సినిమాలు చేయాలనే కోరిక ఏమైనా ఉందా?

నిజానికి నేను అలాంటి చిత్రాలకు సరిపోనేమో అనిపిస్తుంది. చక్కగా ఇప్పటి తరం కుర్రోళ్ళకు కావల్సిన చిత్రాలు చేసుకుంటూ నా కెరీర్ లో ముందుకెళ్ళాలన్నది నా కోరిక. మహానటి లాంటి స్ఫూర్తిదాయకమైన కథల్లో నటించడానికి నేనెప్పుడూ సిద్ధమే. త్వరలోనే తెలుగు లో ఒక కొత్త చిత్రం ప్రకటిస్తాను. మిగిలిన భాషల్లో 6 సినిమాలవరకూ చేయాల్సినవి ఉన్నాయి.

 

 

 

 

 

 

Leave a comment

error: Content is protected !!