సూపర్ స్టార్ కృష్ణ తన సినీ కెరీర్ లో ఎన్నో సార్లు త్రిపాత్రాభినయం చేశారు. అందులో ‘కుమారరాజా’ ఒకటి. తండ్రి, ఇద్దరు కొడుకులుగా కృష్ణ అద్భుతంగా నటించి మెప్పించారు. 1978లో విడులైన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. జయప్రద, లత హీరోయిన్స్ గా నటించగా.. జయంతి, మోహన్ బాబు, నాగభూషణం, గిరిబాబు, అల్లు రామలింగయ్య, రాజబాబు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సత్య చిత్ర బ్యానర్ పై సూర్యనారాయణ, సత్యనారాయణ సంయుక్త నిర్మాణంలో పర్వతనేని సాంబశివరావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కె.వి.మహాదేవన్ సంగీత సారధ్యంలోని పాటలు అప్పట్లో ఊర్రూతలూగించాయి. అందులో ముఖ్యంగా అనురాగ దేవతనీవు పాట .. ఎవర్ గ్రీన్ హిట్.
రాజశేఖర్ ఒక వ్యాపారవేత్త. కొందరు మిత్రులతో ఒక వ్యాపారం చేస్తుంటాడు. అయితే అందులో కొందరు దేవతా విగ్రహాల్ని స్మగ్లింగ్ చేసే ప్రపోజల్ ను రాజశేఖర్ ముందు ఉంచుతారు. రాజశేఖర్ దానికి అంగీకరించడు. దాంతో ఆయన్ను ఒక హత్య కేసులో ఇరికిస్తారు. రాజశేఖర్ ను అరెస్ట్ చేస్తారు. దానికారణంగా తన భార్యని , ఇద్దరు కవల పిల్లల్ని పోగొట్టుకుంటాడు. ఆ కవలలు కుమార్, రాజా లు ఒకొక్కరు ఒకో చోట పెరుగుతారు. పెరిగి పెద్దవారై.. తన తల్లి దండ్రుల్ని కలుసుకోవడమే సినిమా కథాంశం. నిజానికి ఈ సినిమా ‘శంకర్ గురు’ కన్నడ సినిమాకి రీమేక్ వెర్షన్ . రాజ్ కుమార్ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా అప్పట్లో కన్నడ నాట ఘన విజయం సొంతం చేసుకుంది.