విశ్వవిఖ్యత నటసార్వభౌమ డా.యన్టీఆర్ నటించిన కుటుంబ కథా చిత్రాల్లో అఖండ విజయం సాధించిన సినిమా ‘కలిసిఉంటే కలదు సుఖం’. సారథి స్టూడియోస్ బ్యానర్ పై వై. రామకృష్ణ ప్రసాద్ , సి.వి.ఆర్ ప్రసాద్ సంయుక్త నిర్మాణంలో తాపీ చాణక్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1961లో విడుదలైంది. సావిత్రి కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఇంకా.. యస్వీఆర్, పెరుమాళ్ళు, సూర్యాకాంతం, హరనాథ్, హేమలత, గిరిజ, రేలంగి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. మాస్టర్ వేణు సంగీత సారధ్యంలోని పాటలు ఎంతగానో అలరిస్తాయి. ముఖ్యంగా ముద్దుబంతి పువ్వులు పెట్టి , నా వరాల తండ్రి పాటలు ఎంతగానో మెప్పిస్తాయి. ఇందులో యన్టీఆర్ అవిటి వాడి వేషం వేసి ప్రయోగం చేసినప్పటికీ.. ఆయన నటన, కథాబలం సినిమాకి అడ్వాంటేజ్ గా మారాయి.

పట్టాభిరామయ్య (యస్వీఆర్ ), సుందరరామయ్య (పెరుమాళ్ళు) ఇద్దరూ అన్నదమ్ములు. ఎంతో సఖ్యతతో ఉంటారు. పట్టాభిరామయ్యకి పిల్లలుండరు. సుందరరామయ్యకి ఇద్దరు కొడుకులు. అందులో పెద్ద కొడుకు కిష్టయ్య(యన్టీఆర్)కి చిన్నతనంలో గాలిపటం తీసుకొనే ప్రయత్నంలో  కరెంట్ షాక్ వల్ల ఎడమచెయ్యి పనిచేయడం పనిచేయడం మానేస్తుంది. రెండో కొడుకు రఘు (హరనాథ్ ) కాలేజ్ స్టూడెంట్. దయాగుణం కల సుందరరామయ్య భార్య రమణమ్మ ఒక అనాథ అమ్మాయి(సావిత్రి)కి తనింట్లో  ఆశ్రయమిచ్చి.. ఆమెను కిష్టయ్యకిచ్చి పెళ్ళి చేస్తుంది. పట్టాభిరామయ్య భార్య సౌభాగ్యమ్మ. మేనల్లుడు రంగూన్ రాజా(రేలంగి) ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచీ  ఆ ఇంట్లో కలతలు ప్రారంభమవుతాయి. తన అత్తకి మాయమాటలు చెప్పి నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బు కాజేస్తాడు. చవరికి కిష్టయ్య బిడ్డను కిడ్నాప్ చేయడానికి కూడా వెనుకాడడు అతడు. చివరికి కిష్టయ్య తన బిడ్డను రక్షించుకొనే ప్రయత్నంలో మళ్ళీ కరెంట్ షాక్ తగిలి మామూలు మనిషి అవుతాడు. కలిసి ఉంటే కలదు సుఖం అనే సూక్తిని అర్ధం చేసుకొని ఆ ఇంట్లో వారు ఆనందంగా ఉంటారు. నిజానికి ఈ సినిమా శివాజీ గణేశన్ నటించిన తమిళ చిత్రం ‘బాగపిరివినై’ కి రీమేక్ వెర్షన్. ఆ సినిమా కూడా తమిళంలో సూపర్ హిట్టైంది.  

Leave a comment

error: Content is protected !!