చిత్రం : కనులు కనులను దోచాయంటే

నటీనటులు : దుల్కర్ సల్మాన్, రీతూవర్మ, నిరంజని, రక్షణ్, గౌతమ్ మీనన్, అనీష్ కురువిల్లా  తదితరులు

సంగీతం : మసాలా కేఫ్

నిర్మాత : ఆంటనీ జోసెఫ్

దర్శకత్వం : దేసింగ్ పెరియసామి

విడుదల తేదీ : 28, ఫిబ్రవరి 2020

‘ఓకే బంగారం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించి.. ‘మహానటి’ లోని జెమినీ గణేశన్ గా జీవించిన దుల్కర్ సల్మాన్ .. ఆ తర్వాత పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగువారికి మరింత దగ్గరయ్యాడు. ఇప్పుడు  ‘కణ్ణుమ్ కణ్ణుమ్ కొల్లయడిత్తాల్’ తమిళ చిత్రం డబ్బింగ్ వెర్షన్  ‘కనులు కనులను దోచాయంటే’.. చిత్రంతో నేడే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమా కి దేసింగ్ పెరియసామి దర్శకుడు.  మరి ఈ సినిమాతో దుల్కర్ ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పిస్తాడు? ఏ రేంజ్ లో ఆసక్తిని రేకెత్తిస్తాడు ? అనే విషయాలు చూద్దాం.

కథ :

సిద్ధార్ధ ( దుల్కర్ సల్మాన్ ), కల్లీస్ (రక్షణ్ ) చాలా కాలంగా స్నేహితులు. ఇద్దరూ ఫ్రీలాన్స్  జాబ్స్ చేసుకుంటూ..జీవితాన్ని చాలా రిచ్ గా అనుభవిస్తుంటారు. ఈ క్రమంలో వారి జీవితాల్లోకి మీరా (రీతూ వర్మ), శ్రేయా (నిరంజని ) ప్రవేశిస్తారు. స్నేహితులిద్దరూ వారిద్దరితోనూ ప్రేమలో పడతారు. ఇంతటి కూల్ అండ్ సాప్ట్ లవ్ స్టోరీతో సినిమా సాగుతుండగా.. కథలో ఒక్కసారిగా  సడెన్ జర్క్. నగరంలో వివిధ చోట్ల సైబర్ నేరాలు.. ఖరీదైన కార్లలోని వస్తువులూ దోపిడీకి గురవుతూ ఉంటాయి. వీటితో పాటు మరో కేసును డీల్ చేస్తుంటాడు పోలీస్ కమీషనర్  ప్రతాప్ సింహ (గౌతమ్ మీనన్ ). ఈ హడావిడిలో సందట్లో సడేమియాగా..  సిద్ధార్ధ, కల్లిస్, మీరా , శ్రేయా తమ ప్రేమయాత్రలో భాగంగా గోవాకి వెళతారు. అక్కడ మీరా గురించి సిద్ధార్ధకు షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. ఇంతకీ షాకింగ్ న్యూసేంటి? పోలీసులు వెతుకుతున్న ఆ ముఠా ఎవరు? మీరా, సిద్ధార్ధ ల ప్రేమ చివరికి పెళ్ళికి దారితీస్తుందా? లాంటివి తెలుసుకోవాలంటే.. సినిమా చూడాల్సిందే. 

కథనం విశ్లేషణ :

కేవలం లవ్ స్టోరీతోనే సినిమా తీయాలనుకుంటే..  కథని ఏ పక్కకీ దారి మళ్ళించడం  కదురదు. కానీ  అదే లవ్ స్టోరీకి  పేర్లల్ గా ఒక ఇంట్రెస్టింగ్  సబ్ ప్లాట్ ను క్రియేట్ చేసుకొని ,  దానికి థ్రిల్లింగ్ యాస్పెక్ట్స్ జోడిస్తే..  ఆ సినిమా డిఫరెంట్ జోనర్ చిత్రం అయిపోతుంది. దేసింగ్ పెరియసామి ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రానికి ఇచ్చిన టచ్ అదే.  ఒక రొటీన్ లవ్ స్టోరీగానే సినిమాను బిగిన్ చేసిన దర్శకుడు ..  గ్రాడ్యువల్ గా జనాన్ని థ్రిల్లింగ్ జోన్ లోకి తీసుకెళ్లిపోతాడు. స్టోరీకి సడెన్ గా ఇచ్చిన క్రైమ్ కనెక్షన్ .. ఒక్కసారిగా షాక్ గా మారుతుంది.

ఇక ఇంట్రవెల్ బ్యాంగ్ అయితే.. ప్రేక్షకుల  మైండ్ బ్లాక్ అయిపోతుంది.  దానికి తోడు ఖరీదైన కార్లలోని వస్తువులు దోపిడీకి గురవుతుంటే.. ఇలాంటి దొంగతనాలు కూడా జరుగుతాయా అని అందరూ ఆశ్చర్యపోయే స్థాయిలో ఆ సన్నివేశాల్ని తీర్చిదిద్దాడు దర్శకుడు.  కొన్ని చోట్ల లాజిక్ లెస్ అనిపించినా..  ఆ సీన్స్ కు బాగానే కనెక్ట్ అయిపోతారు ప్రేక్షకులు.

ఫస్టాఫ్ లో లాక్ చేసి వదిలేసిన ట్విస్ట్ ల్ని సెకండాఫ్ లో రివీల్ చేస్తూనే సస్పెన్స్ ను చివరి వరకూ మెయిన్ టెయిన్ చేయడంతో ప్రేక్షకుడు ఎంతో ఉత్కంఠకు గురవుతాడు.  ఇక ఇందులో వచ్చే క్రైమ్ సీన్స్ ను చాలా కొత్తగా డిజైన్ చేయడంతో ..  జనం భలే థ్రిల్ అవుతారు.  అసలు అలాంటి దొంగతనాలు కూడా చేసి విలాసాలు అనుభవించొచ్చా అని అందరూ అనుకొనే స్థాయిలో ఆ సీన్స్ ఉంటాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే కార్ సీక్వెన్స్..  టెక్నాలజీకి పరాకాష్ట. అయితే ఆ సీన్స్ ను ఇన్ సెర్ట్ చేయడానికి  దర్శకుడు డిఫరెంట్ గా ఆలోచించాడు. మొత్తం మీద ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రం ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని చెప్పొచ్చు.

నటీనటుల పెర్ఫార్మెన్స్ :

సిద్ధార్ధగా దుల్కర్ సల్మాన్ అదరగొట్టాడు.  తన స్టైలాఫ్ యాక్టింగ్ తో చక్కటి ఎనర్జీతో ఆ పాత్రను రక్తికట్టించాడు.  అలాగే పాటల్లో కూడా మనోడు మంచి ఈజ్ కనబరిచాడు. ‘మహానటి’లో కనిపించిన దల్కర్ కి, ఈ దుల్కర్ కి చాలా డిఫరెన్స్ చూపిస్తూ ..  తన నటనా పటిమను ప్రదర్శించాడు .  ఇక మన కథానాయిక రీతూ వర్మ .. మరోసారి తన ట్రేడ్ మార్క్ నటనతో ఆకట్టుకుంది. అలాగే..  దుల్కర్ ఫ్రెండ్ గా నటించిన రక్షణ్ కూడా  ఆ పాత్రను ఇరగదీశాడు.  పోలీస్ కమీషనర్ గా నటించిన గౌతమ్ మీనన్ ..  తొలిసారిగా తన లోని నటుడ్ని బైటికి తీసి.. దానికి తన విలనిజాన్ని కూడా జోడించి ప్రేక్షకుల్ని అబ్బుర పరిచాడు. మొదట చాలా సీరియస్ గా కనిపించే అతడి పాత్ర.. చివరికి డమ్మీగా మారడం కాస్తంత నిరాశ కలిగిస్తుంది . కానీ టోటల్ గా గౌతమ్ మీనన్ తనలో మంచి నటుడు కూడా ఉన్నాడని చాటుకున్నాడు. అలాగే అనీష్ కురువిల్లా విలనీ కూడా ఆకట్టుకుంటుంది. 

సాంకేతిక నిపుణులు :

మసలా కాఫీ సంగీతం చాలా యూత్ ఫుల్ గా, కొత్తగా  అనిపిస్తుంది . అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కూడా సన్నివేశాలకు తగ్గ మూడ్ ను క్రియేట్ చేయడంలో సంగీత దర్శకుడు బాగా సక్సెస్ అయ్యాడు. అలాగే సినిమా టో గ్రఫీకూడా చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగా కుదరడంతో సన్నివేశాలు  చాలా రిచ్ గా, కలర్ ఫుల్ గా కనిపిస్తాయి. ఇక ఫైనల్ గా చెప్పేదేంటంటే..  క్రైమ్ అండ్ సస్పెన్స్ చిత్రాల్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళకి ‘కనులు కనులను దోచాయంటే’.. చిత్రం భలే ఆప్షన్ .

రేటింగ్ : 3.5

బోటమ్ లైన్ :   మనసు మనసునూ దోచుకునే సినిమా

రివ్యూ బై : రామకృష్ణ క్రొవ్విడి

 

 

 

 

 

Leave a comment

error: Content is protected !!