విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డా.యన్టీఆర్ నటించిన యాక్షన్ చిత్రాల్లో చాలా ప్రత్యేకమైనది ఎదరులేని మనిషి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన తొలి చిత్రం ఇది. కె.బాపయ్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. వాణీశ్రీ కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఇంకా.. జగ్గయ్య, కాంతారావు, ప్రభాకరరెడ్డి, రాజబాబు, అల్లు రామలింగయ్య, జ్యోతిలక్ష్మి , నర్రా వెంకటేశ్వరరావు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. కె.వి.మహదేవన్ సంగీత సారధ్యంలోని పాటలు ఎంతగానో అలరిస్తాయి.

శేఖర్ (ఎన్. టి. రామారావు) బాల్యంలో అతని తండ్రి (సత్యనారాయణ) ని ఇద్దరు భయంకరమైన దుర్గార్గులు రంగా (ప్రభాకర్ రెడ్డి), సర్కార్ (కాంతారావు) లు హత్య చేస్తారు. ఆ హత్య జరిగినపుడు వారిని గుర్తించి తన తమ్ముడు గోపీతో సహా పారిపోతాడు. కాలక్రమంలో వారు విడిపోతారు. తండ్రిని హత్య చేసిన వారిపై పగ సాధించాలన్న పట్టుదల, తమ్ముని కలుసుకోవాలన్న ఆవేదన కలిగి అతను ఎదురులేని మనిషిగా ఎదుగుతాడు. .స్మగ్లర్ల కార్యకలాపాలకు అడుగడుగునా అడ్డు తగులుతాడు. అతనికి లత పరిచయమవుతుంది. ఆమె గత్యంతరంలేక స్మగ్లర్ల చేతిలో బందీ అయిందని పరిచయం పెరిగిన తర్వాత తెలుసుకుంటాడు. స్మగ్లర్ల నుంచి ఆమెకు తప్పించడానికి ప్రయత్నం ప్రారంభిస్తాడు. తన తండ్రిని హత్య చేసింది కూడా స్మగ్లర్లేనని తెలుసుకుంటాడు. చివరకు స్మగ్లర్ల అంతు చూస్తాడు. నిజానికి ఈ సినిమా జానీ మేరా నామ్ బాలీవుడ్ చిత్రానికి రీమేక్ వెర్షన్. దేవానంద్ హీరోగా నటించిన ఆ సినిమా అక్కడ కూడా సూపర్ హిట్టైంది. ఆ తర్వాత అదే సినిమా తమిళంలో ‘రాజా’ గానూ, కన్నడలో ‘అపూర్వ సంగమ’గానూ  రీమేక్ అయింది.

Leave a comment

error: Content is protected !!