రెబల్ స్టార్ కృష్ణంరాజు సినీ కెరీర్ లోనే ప్రత్యేకమైన చిత్రం ‘అంతిమతీర్పు’. మలయాళ వెర్సటైల్ డైరెక్టర్ జోషి తెలుగులో తొలిసారిగా తెరకెక్కించిన ఈ సినిమా 1988 లో విడుదలై అప్పటి ప్రేక్షకుల్ని అబ్బుర పరిచింది. గ్రిప్పింగ్ స్కీన్ ప్లే తో .. ఆసక్తికరమైన సన్నివేశాలతో .. మహామహులైన నటీనటుల అభినయ విన్యాసాలతో రూపొందిన ఈ సినిమా .. నిజానికి మలయాళంలో జోషి దర్శకత్వంలోనే తెరకెక్కిన ‘న్యూ ఢిల్లీ’ సినిమాకి రీమేక్ వెర్షన్ . మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఆయన కెరీర్ లోనూ మరిచిపోలేని చిత్రమైంది. ఒరిజినల్ వెర్షన్ లో నటించిన కథానాయిక సుమలత, ఊర్వశి, త్యాగరాజన్, సురేష్ గోపీ లాంటి నటీనటులే తెలుగులోనూ నటించి మెప్పించారు. స్వార్ధ రాజకీయాలకు బలై.. నా అన్న వాళ్ళను పోగొట్టుకొని, అవిటివాడిగా మారిన నిజాయితీ పరుడైన ఒక జర్నలిస్ట్ …. సొంతంగా ఒక పేపర్ స్థాపించి .. తనను ఆ స్థితికి తీసుకొచ్చిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడమే ‘అంతిమ తీర్పు’ చిత్ర కథ. ఇక ఈ మూవీలో కృష్ణంరాజు తర్వాత అంతటి స్థాయిలో పేరు తెచ్చుకున్న నటుడు నటరాజ విష్ణుగా నటించిన త్యాగరాజన్ (జీన్స్ హీరో ప్రశాంత్ తండ్రి ). ఇక ఇదే చిత్రం ‘న్యూ ఢిల్లీ’ పేరుతోనే హిందీలో జితేంద్రతోనూ, కన్నడలో అంబరీష్ తోనూ రీమేక్ అయిన ఈ సినిమా ఆయా భాషల్లోనూ సూపర్ హిట్టయింది. ఇక అప్పటి జనాన్ని అంతలా అలరించిన ఈ సినిమాకి ఇర్విన్ వేలస్ రాసిన ది ఆల్ మైటీ నవల ఆధారం.