పూర్వం తెలుగు సినిమాల డైలాగుల్లో కానీ, పాటల్లో కానీ.. ఎక్కడ అసభ్యత ధ్వనిస్తుందో చూద్దామనే పట్టుదలతో సెన్సారు వారు కత్తెరతో సిద్ధంగా ఉండేవారు. అప్పటి సినిమాలు ఆరోగ్యకరమైన రీతిలో సంసార పక్షంగా.. కుటుంబ సమేతం చూడదగ్గవిగా ఉండేవి కాబట్టి.. సెన్సార్ వారికి పెద్దగా పనుండేది కాదు. అయితే అప్పుడప్పుడు పాటల్లో మాత్రం అమలిన శృంగార భావంతో రాసినా సరే.. సెన్సార్ కట్స్ తప్పేవి కావు. సాక్షాత్తూ ఆచార్య ఆత్రేయ రాసిన పాటల్లో సైతం సెన్సారింగ్ పడేది.
జగపతి వారి సూపర్ హిట్ చిత్రం అంతస్తులు సినిమాలోని ‘తెల్లచీర కట్టుకున్నదెవరి కోసమూ .. మల్లెపూలు పెట్టుకున్నదెవరికోసమూ’ అనే పాట లోని చరణాల్లోని కొన్ని లైన్స్ కు సెన్సార్ కోత తప్పలేదు. పల్లవిలో నాయకుడు ‘తెల్లచీర కట్టుకున్నదెవరికోసము మల్లెపూలు పెట్టుకున్నదెవరికోసము’ అని అడిగితే… నాయిక ‘తెల్లచీర కట్టినా మల్లెపూలు పెట్టినా కల్లకపటమెరుగని మనసు కోసము… మనసులోని చల్లని మమతకోసము’ అంటూ బదులిస్తుంది. ఈ పాటలో మొత్తం మూడు చరణాలున్నాయి. తొలి చరణంలో నాయకుడు ‘దాచుకున్న మమతలన్ని ఎవరికోసము’ అని అడిగితే నాయిక ‘దాపరికం ఎరుగని మనిషి కోసము’ అంటూ బదులిస్తుంది. వెంటనే నాయకుడు ‘దాగని యవ్వనం ఎవరికోసము’ అని ప్రశ్నిస్తాడు. అందుకు నాయిక ‘దాచుకొని ఏలుకొనే ప్రియుని కోసము’ అని జవాబిస్తుంది. ఇంతవరకు బాగానే వుంది. రెండవ చరణం లోకి వచ్చేసరికి నాయకుడు ‘అద్దాలచెక్కిళ్లు యెవరికోసము’ అని అడుగుతాడు. అందుకు నాయిక ‘ముద్దైన నీ మోవి ముద్రకోసము’ అని బదులిస్తుంది. ఈ చరణానికి సెన్సారు వాళ్ళు ఇక్కడే బ్రేక్ వేశారు. అప్పట్లో తెరపై ముద్దు మీద నిషేధం వుంది. హీరోయిన్ తన పెదవులమీద హీరో ముద్రించే ముద్దుకోసం అంటూ బదులివ్వడం సెన్సారు వారికి ప్రతిబంధకంగా అనిపించింది. ఈ చరణం పొడిగింపుగా ఆత్రేయ ‘పొద్దంత కలవరింత ఎవరి కోసము’ అంటుంటే నాయిక ‘నిద్దురైనరానీని నీకోసము’ అని బదులిస్తుంది. వీటిని మాత్రమే వుండనిచ్చి ‘అద్దాలచెక్కిళ్లు యెవరికోసము’, ‘ముద్దైన నీ మోవి ముద్రకోసము’ వాక్యాలను పాటనుండి పూర్తిగా తొలగించారు. అదండీ.. అప్పటి సెన్సార్ వారి తీరు. మరి నేటి పాటల్లో అయితే .. ఎన్ని చరణాల్లోని ఎన్నెన్ని పదాలకు కత్తెరతో బుద్ధిచెప్పాల్సి వస్తుందో మరి.