50 ఏళ్ళపాటు తన అనితరసాధ్యమైన గళంతో భారతీయ ప్రేక్షకుల్ని ఉర్రూతలూపిన లెజెండరీ సింగర్ .. దివంగత యస్పీ బాలు. మరి ఆయన్ను రికార్డింగ్ థియేటర్ లోకి రానీయకపోవడం ఏంటని మీ సందేహం కదూ.. అది ఆయన గాయకుడిగా ఇంకా అడుపెట్టని టైమ్ లో లెండి. అదే ఆయన మొదటి అవకాశం. దాన్ని సద్వినియోగం చేసుకొనే సమయంలో .. ఆయనికి అనుకోని అడ్డంకి ఏర్పడింది.
ఎస్.పి. బాలసుబ్రమణ్యం తొలిపాట పాడింది ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ (1966)లో అన్న సంగతి తెలిసిందే. సంగీత దర్శకుడు కోదండపాణి పాట రిహార్సల్సు చేయించి, ఫలానారోజు ఉదయం ‘‘విజయగార్డెన్స్లో రికార్డింగు’’ అని రమ్మన్నారు. మురళి అనే స్నేహితుడు సైకిలు తొక్కగా, వెనకాల కూచుని, బాలు విజయగార్డెన్స్కి వెళ్తే సెక్యూరిటీ వాళ్లు లోపలికి పంపలేదు. ‘‘రికార్డింగు వుంది. నేనే పాడాలి’’ అని, ఎస్.పి. చెప్తే, పీలగావున్న కుర్రాడు పాడడం ఏమిటని, ‘నో’ అన్నాడు ద్వారపాలకుడు. అప్పుడు మురళి అనే ఆ స్నేహితుడు ‘‘సేను లోపలికి వెళ్లి పెద్ద వాళ్లని పిల్చుకు వస్తాను’’ అని బతిమాలతే, సైకిలునీ, ఎస్.పి.నీ అక్కడ నించో బెట్టి, లోపనికి వెళ్లి మాట్లాడితే, రికార్డింగ్ సహాయకుడు, సంగీత సహాయకుడూ బయటికి వచ్చి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యాన్ని లోపలికి తీసుకెళ్లాడు.