సూపర్ స్టార్ కృష్ణ నటించిన కుటుంబ కథా చిత్రాల్లో ‘పచ్చని కాపురం’ సినిమా చాలా ప్రత్యేకమైనది. రాజ్యలక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ పై మిద్దేరామారావు నిర్మాణ సారధ్యంలో , తాతినేని రామారావు తెరకెక్కించిన ఈ సినిమా 1985 లో విడుదలైంది. సరిగ్గా 35 ఏళ్ళు పూర్తి చేసుకుంది. శ్రీదేవి కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఇంకా.. కొంగర జగ్గయ్య, కాంతారావు, షావుకారు జానకి, మాస్టర్ అర్జున్ , రాజ్యలక్ష్మి, నూతన్ ప్రసాద్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ప్యార్ ఝక్తా నహీ హిందీ సినిమాకి రీమేక్ వెర్షన్ ఈ సినిమా.
ప్రేమించుకొని పెళ్ళిచేసుకొని .. అపార్దాలతో విడిపోయిన హీరో, హీరోయిన్స్ ను వారి తనయుడు మాస్టర్ అర్జున్ ఒకటి చేస్తాడు. ఇందులో వీరిద్దరినీ విడదీసిన విలన్ గా కొంగరజగ్గయ్య కనిపిస్తారు. ఒక రకంగా ఈ సినిమా కథాంశం శోభన్ బాబు, మంజుల నటించిన ఒకప్పటి ‘మంచిమనుషులు’ సినిమా కథాంశాన్ని పోలి ఉంటుంది. అప్పట్లో ఈ సినిమా తెలుగు వారిని ఎంతగానో మెప్పించింది. చక్రవర్తి సంగీత సారధ్యంలోని పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా ఏసుదాస్ పాడిన వెన్నెలైనా చీకటైనాట పాట ఎవర్ గ్రీన్ హిట్టు గా నిలిచింది. అదే పాటను కృష్ణ అల్లుడు సుధీర్ బాబు నటించిన ప్రేమకథా చిత్రమ్ లో రీమిక్స్ చేయడం విశేషం.