Yuvarj Singh : ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టి ప్రత్యర్థులను గడగడలాడించి.. క్రికెట్ ప్రపంచాన్ని అద్భుతపరిచిన యువరాజ్ సింగ్ జీవితం త్వరలోనే వెండితెరపై ఆవిష్కరించబోతోంది. భారత క్రికెట్ చరిత్రలో ఒక సంచలనంగా నిలిచిన యువీ జీవితం, కేవలం క్రికెట్ మైదానానికి మించి, ఎన్నో మలుపులు తిరిగిన ఒక అద్భుతమైన యాత్ర.
బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ ఈ బయోపిక్‌ను రూపొందించడానికి ముందుకు రావడంతో క్రీడాభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. నిర్మాతలు భూషణ్ కుమార్, రవిభాగ్ చందక్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలువడనున్నాయి.
యువరాజ్ సింగ్ జీవితం కేవలం క్రికెట్‌కు మించి, ఒక పోరాటగాథ. అంతర్జాతీయ క్రికెట్‌లోకి 2000లో అడుగుపెట్టి, దాదాపు 17 ఏళ్లపాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ విజయాల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా, క్యాన్సర్‌తో పోరాడి విజయం సాధించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. యువరాజ్ సింగ్ జీవితం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచినందున, ఈ బయోపిక్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ప్రభావితం చేస్తుందని అంచనా.