ఆయన సినిమాలు కళలతో కళకళలాడినా.. కాసులతోనూ గలగలలాడేవి. తన అభిరుచిని ఏనాడూ కాసులకోసం తాకట్టు పెట్టక.. ఉత్తమమైన చిత్రాల్ని మాత్రమే నిర్మించిన అత్యుత్తమ నిర్మాత ఆయన. శంకరాభరణం, సీతాకోక చిలుక, స్వాతిముత్యం, సాగర సంగమం, స్వయంకృషి, ఆపద్బాంధవుడు లాంటి అద్భుతమైన చిత్రాలు నిర్మించిన ఆయనపేరు ఏడిద నాగేశ్వరరావు . పూర్ణోదయా క్రియేషన్స్ బ్యానర్ పై ఎప్పుడూ అపురూపమైన చిత్రాల్ని మాత్రమే నిర్మించిన అరుదైన నిర్మాత ఆయన.
నటుడవ్వాలని మద్రాస్ కు చేరుకున్న ఏడిద నాగేశ్వరరావు 1962 నుంచి 1974 మధ్యకాలంలో సుమారు 30 సినిమాలలో నటించారు . వంద చిత్రాలకిపైగా డబ్బింగ్ చెప్పారు. ఆ తరువాత కాకినాడకి చెందిన భాస్కరరెడ్డి, రామకృష్ణారెడ్డి, లచ్చిరెడ్డి, వీర్రాజులతో కలిసి ‘వెంకటేశ్వర కల్యాణం’ అనే చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. ఆ సినిమాకి లాభాలు రావడంతో ఆ నలుగురూ కలిసి గీతా కంబైన్స్ అనే సంస్థని ప్రారంభించి నిర్మాణ సారధ్య బాధ్యతల్ని ఏడిద నాగేశ్వరరావుకి అప్పగించారు. అప్పటికే ‘నేరము శిక్ష’లో ఓ కీలకమైన పాత్ర పోషించడంతో ఆ చిత్ర దర్శకుడు కె.విశ్వనాథ్‌తో పరిచయం ఏర్పడింది. ఆయన్ని ఒప్పించి ‘సిరిసిరిమువ్వ’ సినిమాని నిర్మించారు. అది విజయం సాధించింది. తరువాత తన బంధువులతో కలిసి పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ స్థాపించారు. తొలి ప్రయత్నంగా కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వంలో ‘తాయారమ్మ బంగారయ్య’ను నిర్మించారు. అందులో చిరంజీవి ప్రతినాయక ఛాయలున్న ఓ చిన్న పాత్రని పోషించారు. ఆ సినిమా విజయం సాధిండంతోపాటు తమిళం, హిందీ భాషల్లో రీమేక్ అయ్యింది. నిర్మాణ సారథిగా ఒక విజయాన్ని, నిర్మాతగా మరో విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. మూడో సినిమా కోసం మళ్లీ కె.విశ్వనాథ్‌ని సంప్రదించి ‘శంకరాభరణం’ నిర్మించారు. ఇక ఆ చిత్రం తరువాత వెనుదిరిగి చూసుకోనే అవకాశం రాలేదు. ‘సీతాకోక చిలుక’, ‘స్వాతిముత్యం’, ‘సితార’ చిత్రాలకి వివిధ విభాగాల్లో జాతీయ పురస్కారాలు లభించాయి. ‘స్వాతిముత్యం’ తెలుగు నుంచి ఆస్కార్ పరిశీలనకు ఎంపికైంది. చాలా సినిమాలకు వివిధ విభాగాల్లో నంది పురస్కారాలు వరించాయి. చివరిగా ‘ఆపద్బాంధవుడు’ చిత్రాన్ని నిర్మించారు ఏడిద నాగేశ్వరరావు. నేషనల్ ఫిల్మ్ అవార్డు కమిటీ సభ్యుడిగా, నంది అవార్డుల కమిటీ ఛైర్మన్‌గా, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యదర్శిగా సేవలు అందించిన ఏడిద నాగేశ్వరరావు జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహానిర్మాతకు ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.