యాత్రకి యాత్ర 2 కి కథ పరంగా ఎలాంటి సంబంధం లేదు… ఈ మాట చెప్పింది యాత్ర 2 చిత్ర దర్శకుడు మహి వి రాఘవ. 2009 ఎలక్షన్స్ టైమ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర బ్యాక్‌డ్రాప్‌తో యాత్ర తీసి సక్సెస్ సాధించిన మహి వి రాఘవ ఇప్పుడు 2009 నుంచి 2019 వరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ఎదుగుదలను చూపిస్తున్నానంటున్నాడు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా యాత్ర2 మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా మీడియాతో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మహి వి రాఘవ, నిర్మాత శివ మేక ఈ చిత్ర విశేషాలు తెలియజేసారు.
యథార్ధ సంఘటనలను సినిమాగా తీయాలనుకున్నపుడు చాలా రిస్క్ ఉంటుంది. ఎన్నో ఫ్యాక్టర్స్‌ను దృష్టిలో పెట్టుకుని సమతూకం పాటిస్తూ కథ కథనాలను రెడీ చేయాలి. అవన్నీ దృష్టిలో ఉంచుకునే యాత్ర 2 సిద్దం చేసినట్టు చెప్పారు దర్శకుడు మహి వి రాఘవ. ఈ చిత్రంలో వైఎస్ జగన్ రాజకీయంగా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నారో.. విజయం సాధించవరకు జరిగిన సంఘటనలను చూపించామన్నారు. ఓ రాజకీయ నాయకుడు పాదయాత్రతో తనను తాను తెలుసుకుంటూ , ప్రజల కష్టాలు తెలుసుకుంటూ, ఆ రాజకీయ నాయకుడి గురించి ప్రజలు తెలుసుకుంటూ సాగే సమాహారం ఈ సినిమాలో ఉంటుందన్నారు. తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టే ఓ కొడుకు కథ గా ఈ యాత్ర 2 ఉండబోతుందన్నారు. వాస్తవ కథ అయినా ఆకట్టుకునే విధంగా సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటూ కథలో కొన్ని మార్పులు చేసామని చెప్పారు. ఈ సినిమా ఎన్నికల టైమ్‌లోనే రిలీజ్ చేస్తున్నాం. వైసీపీ వాళ్ల కోసమే ఈ సినిమా చేసామని అనుకుంటే అనుకోనివ్వండి.. నమ్మేవాళ్లు నమ్ముతారు లేదంటే లేదు అన్నారు. అలాగే ఈ సినిమా పొలిటికల్‌గా ఎలాంటి ప్రభావం చూపుతుందనుకోవడం లేదు.. ఆంధ్ర ఓటర్లను తక్కువ అంచనా వేయొద్దు.. వారు ఎవరికి ఓటు వేయాలనుకుంటే వారికే వేస్తారు.. అలాగే ఆర్జీవి తీసే వ్యూహం సినిమా ఈ యాత్ర 2 పై ప్రభావం చూపదన్నారు దర్శకుడు మహి వి రాఘవ.
యాత్ర సినిమాను అందరూ సపోర్ట్ చేసారు. ఈ సినిమాను కూడా అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నామని చిత్ర నిర్మాత శివ మేక అన్నారు.
ఈ చిత్ర నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు మేకర్స్. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.. మధి సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు.