తెలుగు సినీ ఇండస్ట్రీలో సావిత్రి అంటే గుర్తు పట్టేవారు ఉండొచ్చూ ఉండకపోవచ్చు. నిశ్శంకర సావిత్రి అన్నా గుర్తు పట్టరేమో.. కానీ మహానటి అన్న పేరు వినగానే ఎలాంటి వారికయినా మనసులో మెదిలే రూపం సావిత్రి గారిదే. మహానటి అన్న పదానికి సరైన నిర్వచనం సావిత్రి అంటే ఒప్పుకోని వారెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆమె చేసిన మరపురాని పాత్రల్లో ఆమోఘమైన నటనే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. కానీ కొన్ని విషయాలు వింటే మాత్రం ఆమె మహానటి కాదు అంతకుమించి అని ఒప్పుకోవాల్సిందే. అలాంటి సంఘటనే మాయాబజార్ మేకింగ్‌లో జరిగింది.
ఈ చిత్ర దర్శకులు కె.వి రెడ్డి గారు. ఒక సాంగ్ చరణంలో సావిత్రి ఏడుస్తూ నటించాల్సి వుంది. ఇలాంటి సమయంలో ఆర్టిస్ట్‌లకు గ్లిజరిన్ ఇస్తారు. కానీ ఆ టైమ్‌లో గ్లిజరిన్ లేని కారణంగా ఎలా షూట్ చేయాలి అని ఆలోచిస్తున్నారట కె.వి రెడ్డి గారు అతని అసిస్టెంట్ టీమ్. అయితే సావిత్రి మాత్రం బాబాయి గారు ఎంత ఏడవాలో, ఏ కంటిలో ఎన్ని కన్నీటి బొట్లు రాల్చాలో చెప్పండి అంతే వస్తుంది అన్నారట.మొదట ఏంటీ అమ్మాయి గర్వం అనుకున్నారట. ఫ్రేమ్‌లో కుడి
కన్ను ఉంటుంది. ఆ కంటి నుంచి మూడే కన్నీటి బొట్లు రాల్చాలి చేయి చూద్దాం అని సవాల్‌గా అన్నారట కె.వి రెడ్డిగారు. కె. వి రెడ్డి గారు చెప్పిన సిచ్చుయేషన్‌ని ఫీల్ కావడం కోసం కొద్ది టైమ్ తీసుకుని టేక్ చేసిందట. కుడి కంటిలో మూడంటే మూడే కన్నీటి బొట్లు రాల్చడం.. అది కూడా సింగిల్ టేక్ లో చేసేయడంతో ఆశ్చర్యపోవడం కె.వి రెడ్డి గారి వంతయ్యింది. నటన పట్ల ఆమెకున్న పట్టు, అంకితభావం అలాంటిది మరి. అంతటి ప్రతిభ ఆ తరంలోనూ ఈ తరంలోనూ ఎంత వెదికినా కనిపించరు. అందుకే సావిత్రి మహానటే కాదు అంతకుమించి అని ఒప్పుకుని తీరాల్సిందే.